Monday, April 29, 2024

నిదానంగా వరద.. శ్రీశైలం నిండేందుకు మరో నెలరోజులు

అమరావతి, ఆంధ్రప్రభ: వరద నిదానంగా ప్రవహిస్తోంది. కృష్ణా బేసిన్‌లో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టయిన శ్రీశైలం గత ఏడాది ఇదే సమయానికి నిండుకుండలా తొణికిసలాడగా ఈ సంవత్సరం మాత్రం వరద నీటి కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. 886 అడుగుల గరిష్ట వరద నీటి మట్టానికి గాను శ్రీశైలంలో బుధవారం సాయంత్రం నాటికి 853.90 అడుగులకు చేరింది. 215 టీఎంసీల గరిష్ట నీటి నిల్వ సామర్ద్యానికి గాను జలాశయంలో 88.74 టీ-ఎంసీల నిల్వలున్నాయి. ఎగువ నుంచి రిజర్వాయర్‌ లోకి 78,245 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఇదే ఒరవడి కొనసాగితే శ్రీశైలం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్ద్యానికి చేరువయ్యేందుకు ఈ నెలాఖరు దాకా సమయం పట్టే అవకాశం ఉందని అంచనా.

ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్‌, తుంగభద్ర నుంచి శ్రీశైలంకు వరద ప్రవాహం రావాల్సి ఉంది. తుంగభద్ర పూర్తిస్థాయిలో జలకళ సంతరించుకున్నా అవుట్‌ ఫ్లో రూపంలో దిగువకు విడుదల చేసే నీరు తక్కువగానే ఉంది. ఈ నేపథ్యంలో ఎగువ నుంచి భారీ నీటి ప్రవాహం కోసం శ్రీశైలం ఎదురుచూస్తోంది. శ్రీశైలం జలాశయంలో నీళ్ళు పూర్తిస్థాయి వరద నీటి మట్టానికి చేరువవుతున్న సమయంలోనే అవుట్‌ ఫ్లో రూపంలో దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. నాగార్జున సాగర్‌ లో 312 టీఎంసీల గరిష్ట నిల్వ సామర్ద్యానికి గాను 140 టీఎంసీల నిల్వలున్నాయి.

- Advertisement -

ఎగువ నుంచి చుక్క నీరు కూడా వచ్చి చేరటం లేదు. ఇటీవల తాగునీటి అవసరాల కోసం కృష్ణా బోర్డు సాగర్‌ నుంచి 5 టీఎంసీల నీటి విడుదలకు అనుమతించింది. అనుమతుల మేరకు 5 టీఎంసీలను తీసుకోవటంతో నీటి విడుదల ప్రక్రియను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో సాగర్‌ ఆయకట్టు అవసరాలతో పాటు తాగునీటికి సమస్య లేకుండా నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆల్మట్టిలో 129 టీ-ఎంసీల గరిష్ట సామర్ద్యానికిగాను 114 టీ-ఎంసీల నిల్వలుండగా 82,481 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

జూరాల నుంచి 41,584 క్యూసెక్కులు, నారాయణపూర్‌ నుంచి 86,203 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ఏపీ పరిధిలోని తుంగభద్ర గరిష్ట నిల్వ సామర్ద్యానికి చేరువవుతోంది. 100 టీఎంసీల సామర్ద్యానికి గాను జలాశయంలో 81.54 టీఎంసీల నిల్వలున్నాయి. బుధవారం సాయంత్రం నాటికి తుంగభద్రకు ఎగువ నుంచి 29,763 క్యూసెక్కులు ఇన్‌ ఫ్లో రూపంలో చేరుతుండగా దిగువకు 2099 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

సీమను కరుణించిన తుంగభద్ర

రాయలసీమలో ప్రధాన సాగునీటి వనరుగా ఉన్న తుంగభద్ర నిండుకుండలా దర్శనమిస్తుండటంతో అక్కడి రైతాంగంలో సంతోషం తొణికిసలాడుతోంది. ఉమ్మడి కడప జిల్లా పరిధిలో మైలవరం ప్రాజెక్టు కింద సుమారు 68 వేల ఎకరాలు, పులివెందుల బ్రాంచి కెనాల్‌ కింద 50 వేల ఎకరాలు, కడప జిల్లాలో కేసీ కెనాల్‌ కింద 92 వేల ఎకరాలతో పాటు కర్నూలు జిల్లాలో 1.73 లక్షల ఎకరాలు, తుంగభద్ర దిగువ కాల్వ కింద కర్నూలు జిల్లాలోనే మరో 1.51 లక్షల ఎకరాలు, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 1.45 లక్షల ఎకరాల్లో సాగుకు తుంగభద్రే ప్రధాన వనరుగా ఉంది. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌ లో సాగునీటి అవసరాలను పూర్తిగా తీర్చే స్థాయిలో తుంగభద్రకు నీరు రావటంతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement