Wednesday, May 1, 2024

సింగపూర్‌ ఓపెన్ సెమీస్‌కు సింధు! సైనా, ప్రణయ్‌లకు షాక్‌

సింగపూర్‌ ఓపెన్‌ సూపర్‌ 500 టోర్నమెంట్‌లో శుక్రవారంనాడు భారత్‌కు మిశ్రమ ఫలితాలు అందాయి. భారత బ్యాడ్మింటన్‌ దిగ్గజం పీవీ సింధు సెమీస్‌కు దూసుకెళ్లగా, స్టార్‌ షట్లర్లు సైనా నెహ్వాల్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ల పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. డబుల్‌ ఒలింపిక్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌, ప్రపంచ ఏడో ర్యాంకర్‌ అయిన సింధు, క్వార్టర్స్‌లో చైనా క్రీడాకారిణి హాన్‌ యూను 17-21, 21-11, 21-19తేడాతో ఓడించింది. సెమీస్‌ బెర్త్‌ను కన్ఫర్మ్‌ చేసుకుంది. మహిళల సింగిల్స్‌లో భాగంగా శుక్రవారంనాడు 62 నిముషాల పాటు సాగిన పోరులో సింధు తొలి సెట్‌లో ఓటమి చవిచూసినా, ఆ తర్వాత రెండు, మూడు సెట్‌లలో వరుసగా విజయం సాధించింది. సెమీస్‌లో 38వ ర్యాంకర్‌, జపాన్‌ క్రీడాకారిణి సయీనా కవాక్స్మితో తలపడనుంది. క్వార్టర్స్‌లో థాయిలాండ్‌కు చెందిన ఆరో సీడ్‌ క్రీడాకారిణి చూచ్వోంగ్‌ను 21-17, 21-19తేడాతో కవాక్స్మి ఓడించింది. ఈ నెల 28 నుంచి బర్మింగ్‌హామ్‌ వేదికగా జరుగబోయే కామన్వెల్త్‌ గేమ్స్‌కు సన్నద్ధమవుతున్న పీవీ సింధు… సింగపూర్‌ ఓపెన్‌ టైటిల్‌ నెగ్గాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన విషయం తెలిసిందే.

ఇక మరో మ్యాచ్‌లో సెనా నెహ్వాల్‌ ఉమెన్స్‌ సింగిల్స్‌ విభాగంలో క్వార్టర్‌ ఫైనల్స్‌లో జపాన్‌కు చెందిన అయ ఒహోరి చేతిలో 13-21, 21-15, 20-22 తేడాతో ఓటమి పాలైంది. తొలి సెట్‌లో ఓడినా రెండో సెట్‌లో పుంజుకున్న సైనా… తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయింది. వ్యూహం మార్చిన ఆడిన ఒహోరి మూడో సెట్‌లో సైనాకు చెక్‌ పెట్టింది. దీంతో సైనాకు ఓటమి తప్పలేదు. ఇక పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌కు కూడా షాక్‌ తప్పలేదు. జపాన్‌ షట్లర్‌ కొడాయి నరోకా చేతిలో 21-12, 14-21, 18-21 తేడాతో ఓడిపోయాడు. 63 నిముషాలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో ప్రణయ్‌ మళ్లి గతంలో చేసిన తప్పిదాలే చేసి ఓటమి కొని తెచ్చుకున్నాడు. ఇప్పటికే కిదాంబి శ్రీకాంత్‌, మిథున్‌ మంజునాథ్‌ టోర్నీ నుంచి వైదొలగిన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement