Friday, May 17, 2024

యూఎన్‌ చీఫ్‌ కళ్లముందే రష్యా క్షిపణి దాడులు.. మాస్కోలో చర్చలు, కీవ్‌లో విధ్వంసం

ఉక్రెయిన్‌ను ఎలాగైనా దారికితెచ్చుకోవాలని తహతహలాడుతున్న రష్యా అంతర్జాతీయ నియమనిబంధనలను ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ అంటోనియా గుటెరస్‌ ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో పర్యటిస్తున్న నేపథ్యంలో గురువారంనాడు క్షిపణులతో విరుచుకుపడింది. గుటెరస్‌ పర్యటిస్తున్న ప్రాంతానికి సమీపంలోని ఓ భవనాన్ని రష్యా ప్రయోగించిన క్షిపణులు తాకి విధంసాన్ని సృష్టించాయి. అయితే, ఈ ఉత్పాతంలో గుటెరస్‌ బృందం సురక్షితంగా బయటపడింది. రష్యా యుద్ధోన్మాదంపట్ల యూఎన్‌ చీఫ్‌ దిగ్భ్రాంతికి గురయ్యారని ఆయన కార్యాలయం ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారంనాడు మాస్కోలో పర్యటించిన గుటెరస్‌ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. మరియపోల్‌లోని అతిపెద్ద అజోవ్‌స్టాల్‌ స్టీల్‌ ప్లాంట్‌లో చిక్కుకుపోయిన పౌరులను, క్షతగాత్రులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు, ఆహారం, మంచినీరు అందించేందుకు అవకాశం కల్పించాలన్న గుటెరస్‌ ప్రతిపాదనలపై పుతిన్‌ సానుకూలంగా స్పందించారు. రెడ్‌క్రాస్‌, ఐక్యరాజ్య సమితి మానవతా సాయం అందించే విభాగాలకు చెందినవారిని మరియపోల్‌లోకి అనుమతిస్తామని మాటిచ్చారు. అక్కడినుంచి తిరుగు ప్రయాణంలో గురువారం ఉక్రెయిన్‌కు చేరుకున్న గుటెరస్‌ కీవ్‌లోని క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తుండగా రష్యా క్షిపణుల వర్షం కురిపించింది.

దీంతో యూఎన్‌ బృందం ఉలిక్కిపడింది. యుద్ధతీవ్రత, ప్రభావం ఎంత దారుణంగా ఉందో రష్యా దాడివల్ల తెలిసిందని, అదృష్టవశాత్తు ఎవరికీ ఏమీ కాలేదని ఐక్యరాజ్య సమితి మానవతా విభాగం అధికార ప్రతినిధి సవియానో అబ్రెయూ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అయితే, గుటెరస్‌ పర్యటిస్తున్న ప్రాంతానికి ఎంత దూరంలో క్షిపణి దాడి జరిగిందన్న వివరాలను ఆయన వెల్లడించలేదు. కాగా రష్యా దాడిని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఖండించారు. మాస్కోలో చర్చలు జరిపిన గుటెరస్‌ కీవ్‌కు చేరగానే క్షిపణులు, ఐదు రాకెట్లతో దాడులకు పాల్పడిందని, ఇది ఐక్యరాజ్య సమితిని అవమానించడమేనని అన్నారు. రష్యా నాయకత వైఖరికి ఈ ఘటన అద్దం పడుతోందని అన్నారు. కాగా మరియపోల్‌ స్టీల్‌ప్లాంట్‌లో కనీసం లక్షమంది చిక్కుపోయారని, వారిని అక్కడినుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహకరించాలని రష్యాను కోరినట్లు జెలెన్‌స్కీతో భేటీ సందర్భంగా గుటెరస్‌ చెప్పారు. అయితే అందుకు భిన్నంగా అక్కడి పరిస్థితులున్నాయి. ఏ ఒక్కరినీ బయటకు వెళ్లనీయడం లేదని, ఔషధాలు, ఆహారం అందనీయడం లేదని డోన్‌బాస్‌ గవర్నర్‌ పావ్‌లో కిరిలెంకో వెల్లడించారు.

కాగా పౌరులందరూ స్టీల్‌ప్లాంట్‌నుంచి బయటకు రావాలని, యుద్ధం చేస్తున్న సైనికులు ఆయుధాలు వీడి లొంగిపోవాలని పుతిన్‌ కోరుకుంటున్నారని క్రెవ్లిున్‌ అధికార ప్రతినిధి దిమిత్ర పెస్కోవ్‌ స్పష్టం చేశారు. మరోవైపు ఉక్రెయిన్‌కు మరి కొన్ని నెలలపాటు సాయం అందించాల్సి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అభిప్రాయపడ్డారు. యుద్ధపీడిత ఉక్రెయిన్‌కు మరో 33 బిలియన్‌ డాలర్ల సాయం అందించేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనకు కాంగ్రెస్‌ ఆమోదముద్ర వేసింది. ఆయుధాలు, ఆహార పదార్థాలు అందించేందుకు కొంత సాయంగాను, మరికొంత రుణంగాను ఈ మొత్తాన్ని అందిస్తారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement