Thursday, May 9, 2024

Delhi | ఏపీలో దొంగ ఓట్ల నమోదు.. సుప్రీంలో నిమ్మగడ్డ రమేశ్ పిటిషన్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు నమోదవుతున్నాయని ఆరోపిస్తూ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ మరో ధర్మాసనానికి బదిలీ అయింది. మంగళవారం ఈ కేసు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసినందున ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నానని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా వెల్లడించారు.

ఈ పరిస్థితుల్లో ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు మరో ధర్మాసనానికి కేసును బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి జస్టిక్ బీఆర్ గవాయ్ సూచించారు. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఆధ్వర్యంలోని ‘సిటిజెన్స్ ఫర్ డెమొక్రసీ’ సంస్థ ఈ పిటీషన్ దాఖలు చేసింది. ఐప్యాక్ మాజీ ఉద్యోగులను ఉపయోగించుకుని ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు చేర్చుతున్నారని పిటిషన్‌లో ఆరోపించారు.

- Advertisement -

ర్యామ్ ఇన్ఫో లిమిటెడ్, ఉపాధి టెక్నో సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మ్యాక్ డిటెక్టివ్ అండ్ గార్డింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు వాలంటీర్ల ద్వారా సేకరించిన డేటాను ఫ్రొపైలింగ్ చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సంస్థలకు రూ.68 కోట్ల ప్రజాధనాన్ని ధారపోసినట్లు నిమ్మగడ్డ తన పిటిషన్‌లో వెల్లడించారు. ఓటర్ల నమోదులో ఏపీ ప్రభుత్వం యధేచ్చగా జోక్యం చేసుకుంటోదంటూ ఆరోపించారు. ఓటర్ల నమోదులో గ్రామ, వార్డు వాలంటీర్లు, కార్యదర్శులను భాగస్వాములను చేయడంపై కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement