Sunday, June 16, 2024

మూడు రోజులపాటు వర్షాలు.. ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. ఈ మేరకు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ను జారీ చేసింది. వ ర్షాలతోపాటు బలమైన ఈదురుగాలులు వీస్తాయని, వడగళ్లు వాన కురిసే ప్రమాదముందని, పిడుగులు పడుతాయని హెచ్చరించింది. ఈ పరిస్థితుల్లో రైతులు, పౌరులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

మరీ ముఖ్యంగా వర్షం కురిసే సమయంలో చెట్ల కింద కాని, ఆరుబయట కాని ఉండొద్దని సూచించింది. శని, ఆదివారాల్లో ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తన ద్రోణి రాయలసీమ, పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుంచి సగటున 1.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోందని తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు.

- Advertisement -

శని, ఆది, సోమవారాల్లో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వాతావరణం కేంద్రం పేర్కొంది. ఆదిలాబాద్‌, కొమ్రంభీం, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. అక్కడక్కడా వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

గంటలకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వర్షం కురుస్తున్నపుడు చెట్ల కింద ఉండొద్దని సూచించింది. పగటిపూట ఎండ ఎక్కువగా ఉంటుందని, సాయంత్రానికి ఆకాశం మేఘావృతమై వానలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో గడిచిన 48 గంటల్లో కొన్ని ప్రాంతాల్లో గరిష్టంగా 36 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణశాఖ వివరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement