Tuesday, July 23, 2024

PM Modhi : పాకిస్థాన్‌కు గాజులు తొడిగిస్తాం.. ప్రధాని మోదీ

పాకిస్థాన్ వద్ద వేసుకోవడానికి గాజులేమీ లేకపోతే.. తాము పాకిస్థాన్‌కు గాజులు తొడిగిస్తామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఫరూక్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా.. పాక్ ఆర్థిక దుస్థితిని ఎత్తి చూపుతూ విమర్శలు గుప్పించారు.

- Advertisement -

ఫరూక్ అబ్దుల్లా ఏమన్నారంటే..
ఇటీవలి ఓ సభలో రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రసంగిస్తూ.. పాక్ ఆక్రమిత కశ్మీర్ ను త్వరలో స్వాధీనం చేసుకుంటామని పేర్కొన్నారు. దీనిపై ఇండియా కూటమిలో భాగస్వామ్యమైన కశ్మీర్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ అగ్రనేత ఫరూక్ అబ్దుల్లా విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్ చేతికి గాజులు వేసుకుని ఏమీ కూర్చోలేదని.. దాని దగ్గర అణు బాంబులు ఉన్నాయని, అవి వేస్తే భారత దేశానికి ప్రమాదమని వ్యాఖ్యానించారు.

గట్టిగా కౌంటర్ ఇచ్చిన ప్రధాని మోదీ..
సోమవారం బీహార్ లోని ముజఫర్ పూర్ పర్యటించిన ప్రధాని మోదీ.. ఫరూక్ అబ్దుల్లా పేరును ప్రస్తావించకుండా గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘‘పాకిస్థాన్ గాజులు వేసుకుని లేకుంటే.. మనం పాకిస్థాన్ గాజులు తొడిగిద్దాం.. వాళ్లకు ఆహారమైన గోధుమ పిండి లేదు.. కరెంటు సరిగా లేదు. ఇప్పుడు వాళ్ల దగ్గర చివరికి గాజులు కూడా లేవని నాకు ఇప్పుడే తెలిసింది” అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

స్వయంగా గరిటె తిప్పి.. భక్తులకు పాయసం…
ఎన్నికల ప్రచారంలో భాగంగా బిహార్ లో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పట్నాలోని గురుద్వారాను సందర్శించారు. సంప్రదాయ సిక్కుల తలపాగా ధరించి ప్రార్థనాలయంలోకి ప్రవేశించారు. 18వ శతాబ్దంలో మహారాజా రంజిత్ సింగ్ నిర్మించిన శ్రీ పట్నా సాహిబ్ గురుద్వారాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

అనంతరం గురుద్వారాలోని వంటశాలలోకి ప్రధాని వెళ్లారు. దైవ సేవలో భాగంగా పొయ్యిపై ఉన్న భారీ వంట పాత్రలో తయారవుతున్న పాయసం ప్రసాదాన్ని స్వయంగా గరిటెతో కలియదిప్పారు. ఆ తర్వాత ఓ స్టీల్ బకెట్ లోకి ఆ ప్రసాదాన్ని తీసుకొని భక్తులకు తన చేత్తోనే వడ్డించారు.

అంతకుముందు రొట్టెలు కూడా ఒత్తారు. తన దర్శన వివరాలతోపాటు ఫొటోలను మోదీ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.

‘ఈ ఉదయం తఖ్త్ శ్రీ హరిమందర్ జీ పాట్నా సాహిబ్ లో ప్రార్థనలు చేశా. సిక్కు మతం సమానత్వం, న్యాయం, దయ సూత్రాలతో నిండినది. ఈ మతంలో సేవ ప్రధానమైనది. దైవ సేవలో పాల్గొనే అవకాశం నాకు లభించింది. ఇది నాకు ఓ ప్రత్యేక అనుభూతిని ఇచ్చింది’ అని కామెంట్ ను జోడించారు. మరోవైపు మోదీ దైవ సేవలో నిమగ్నమైన వీడియోను ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ ఐ తన ‘ఎక్స్’ ఖాతాలో నెటిజన్లతో పంచుకుంది. పట్నా ప్రాంతం సిక్కుల 10వ గురువు అయిన గురు గోబింద్ సింగ్ జన్మస్థలం కావడంతో ఈ గురుద్వారాకు విశేష ప్రాధాన్యం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement