Sunday, July 14, 2024

Modi 3.0 | మోదీ 100 రోజుల ప్ర‌ణాళిక‌లో.. రెండు కీలక ప్రాజెక్టులకు చోటు

మోదీ 3.0 మొదటి 100 రోజుల ప్రణాళికలో రెండు కీలక రోడ్ల ప్రాజెక్టులకు చోటు దక్కింది. దేశవ్యాప్తంగా మొత్తం 3 వేల కిలోమీటర్ల రోడ్డు ప్రాజెక్టులను ఎంపిక చేయగా.. అందులో తెలంగాణ నుంచి రెండు రోడ్లకు అవకాశం కల్పించారు. ఆర్మూరు – జగిత్యాల – మంచిర్యాల యాక్సెస్‌ కంట్రోల్డ్‌ రోడ్డు.. జగిత్యాల–కరీంనగర్‌ నాలుగు వరుసల రోడ్డుకు ఇందులో అవకాశం కల్పించారు. జాతీయ రహదారి 63, జాతీయ రహదారి 563 లకు రాజయోగం దక్కనుంది. ఈ ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

నిజామాబాద్‌–ఛత్తీస్‌గడ్‌లోని జగ్దల్‌పూర్‌ మధ్య ఉన్న ఎన్‌హెచ్‌–63ను విస్తరించాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. దీనికి సంబంధించి గత ఫిబ్రవరిలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది. ఇందులో భాగంగా పట్టణాలు, గ్రామాలు ఉన్న చోట బైపాస్‌లు నిర్మించి, మిగతా రోడ్డును విస్తరిస్తారు. ఆర్మూరు, మెట్‌పల్లి, కోరుట్ల, జగిత్యాల, లక్సెట్టిపేట మీదుగా వెళ్లే ఈ రోడ్డు పొడవు 131.8 కిలోమీటర్లు. ఇక ఈ మార్గంలో 6 నుంచి 12 కిలోమీటర్ల మేర భారీ బైపాస్‌లు ఉంటాయి. ఇవే కాకుండా మరో 8 ప్రాంతాల్లో చిన్న బైపాస్‌లను నిర్మించనున్నారు. రోడ్ క్రాసింగ్‌ల వద్ద ఎలివేటెడ్‌ కారిడార్లను నిర్మిస్తారు. ఈ మార్గంలో దాదాపు 46 వంతెనలు, అండర్‌పాస్‌లు, ఆర్‌ఓబీలు ఉంటాయి. ఈ మొత్తం ప్రాజెక్టు ఖర్చు రూ.3,850 కోట్లు.

మరోవైపు.. జగిత్యాల నుంచి ఖమ్మం వరకు విస్తరించి ఉన్న ఎన్‌హెచ్‌–563లో కీలక భాగమైన 58.86 కిలోమీటర్ల పొడవు ఉన్న మరో ప్రాజెక్టుకు సంబంధించి 6 నెలల క్రితమే టెండర్లు పూర్తి కాగా.. గత టెండర్లను రద్దు చేసి మళ్లీ కొత్తగా పిలవాలని తాజాగా నిర్ణయించారు. ఆ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి వందరోజుల గడువులో నిర్మాణ పనులు మొదలుపెట్టనున్నారు. దీనికి రూ.2,151 కోట్లు ఖర్చు అవుతుందని గతంలో అంచనా వేయగా.. అది ఇప్పుడు రూ.2,300 కోట్లకు పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement