Tuesday, April 16, 2024

Delhi | వంద శాతం ఓటింగ్ పెరిగిన పార్టీ మాదే.. : కిషన్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పవన్ కళ్యాణ్‌పై తాను వ్యాఖ్యలు చేసినట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నానన్నారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి. అసలు అలాంటి చర్చే జరగలేదని ఆయన స్పష్టం చేశారు. ఎవరో ఏదో రాసి పెడితే అదే నిజం కాదని చెప్పారు. పవన్ కళ్యాణ్, బీజేపీకి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన పుకార్లపై పోలీసులకు ఫిర్యాదు చేశామని కిషన్‌రెడ్డి తెలిపారు.

సోమవారం ఆయన న్యూఢిల్లీలోని తన నివాసంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్‌పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు. ఆర్టికల్ 370 రద్దు అనంతరం అక్కడ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పుకొచ్చారు. అన్ని రాష్ట్రాలతో పాటు జమ్ముకశ్మీర్‌కు సమానంగా హక్కులు, అధికారాలు కలిగి ఉండాలని కోరుకున్నామని తెలిపారు. అక్కడ భారత రాజ్యాంగం అమలు జరగాలని, అన్నింటికీ మించి శాంతి నెలకొనాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు.

దీనికి తగ్గట్టే అక్కడి సమాజం నుంచి సానుకూల స్పందన కనిపిస్తోందని, అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయని కిషన్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.  ఆ రాష్ట్రంలో పర్యాటకం బాగా పెరిగిందని, ఈ ఏడాది 2 కోట్లు దాటి పర్యాటకులు సందర్శించారని వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌లో మొదటిసారి జీ-20 అంతర్జాతీయ సదస్సు నిర్వహించామని అన్నారు. కాంగ్రెస్ సహా విపక్షాల నేతలు జమ్ము కశ్మీర్‌పై అంతర్జాతీయ సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్లేలా మాట్లాడారని గుర్తు చేశారు.

- Advertisement -

సుప్రీంకోర్టు తీర్పుపై వ్యాఖ్యలు చేస్తున్న వారికి కశ్మీర్‌లో మార్పు ఇష్టం లేదని, అక్కడి మహిళలకు స్వేచ్చ, సమానత్వం ఇవ్వడం ఇష్టంలేదని విమర్శించారు. ఆర్టికల్ 370 రద్దు సమయంలో తాను హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నానని, దానిపై 3 నెలల కసరత్తులో భాగమయ్యానని గుర్తు చేశారు. 2019తో పోల్చి చూస్తే ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఉగ్రవాదం 80శాతం తగ్గిందని, అక్రమ చొరబాట్లు నామమాత్రంగా ఉన్నాయిని, పోలీసులపై రాళ్లు రువ్వే ఘటనలు జరగలేదని, అప్పట్లో ఆడపిల్లలు, స్కూల్ పిల్లల్ని ఉసిగొల్పి హింసకు పాల్పడేవారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచం ఊహించని విధంగా, నివ్వెరపోయేలా పరిస్థితులు మారాయని చెప్పారు.

కరప్షన్ పార్టీ కాంగ్రెస్

రాహుల్ గాంధీ సన్నిహితుడు, కాంగ్రెస్ నేత ధీరజ్ సాహు ఇంట్లో రూ. 351 కోట్లు (ఇప్పటివరకు) స్వాధీనం చేసుకున్న విషయం భారతదేశ చరిత్రలో సంచలనం సృష్టించిందని, ఐటీ దాడుల్లో ఇంత పెద్దమొత్తంలో నల్లధనం దొరకడం మొదటిసారని కిషన్ రెడ్డి వివరించారు. ఆయన నోట్లు రద్దు సమయంలో “ఇంత నల్లధనాన్ని ఎలా దాచిపెడతారు” అంటూ ట్వీట్ కూడా చేశారని గుర్తు చేశారు. ఐటీ దాడుల్లో దొరికిన డబ్బంతా వచ్చే పార్లమెంట్ ఎన్నికల కోసం పోగు చేస్తున్నట్టు స్పష్టమైందని వివరించారు.

కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ అవినీతి ఉంటుందని, దాని మారు పేరే కరప్షన్ పార్టీ అని ఎద్దేవా చేశారు. 5 – 6 నెలల క్రితం కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, ఐదేళ్లలో రానంత వ్యతిరేకత మూట గట్టుకుందని ధ్వజమెత్తారు. ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న ప్రభుత్వం కూడా అవినీతి కారణంగా ఓడిపోయిందని విమర్శించారు. కర్ణాటక నుంచి తెలంగాణకు నల్లధనం పంపించి ఎన్నికల్లో ఖర్చు పెట్టిందని, కొంత పట్టుబడిన విషయం తెలిసిందేనని కిషన్ రెడ్డి చెప్పారు.

నియమాలకు విరుద్ధంగా, సీనియారిటీని కాదని, తమ స్వార్థం కోసం కాంగ్రెస్ పార్టీ మజ్లిస్‌కు చెందిన వ్యక్తిని ప్రొటెం స్పీకర్‌గా నియమించడం శాసనసభ నిబంధనల ఉల్లంఘన అవుతుందని కేంద్రమంత్రి అభిప్రాయపడ్డారు. అందుకే తాము ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బహిష్కరిస్తామని, రెగ్యులర్ స్పీకర్ వచ్చాకే ప్రమాణం చేస్తామన్నారు. తెలంగాణలో వంద శాతం ఓటింగ్ పెరిగిన ఏకైక పార్టీ బీజేపీయేనని ఆయన హర్షం వ్యక్తం చేశారు. అన్నిటికీ మించి ఔట్ గోయింగ్, ఇన్‌కమింగ్ సీఎం అభ్యర్థులను ఓడించి బీజేపీ చరిత్ర సృష్టించిందన్నారు.

శబరిమలపై కేరళ ప్రభుత్వ సహాయ నిరాకరణ

శబరిమలలో పూర్తి స్థాయిలో భక్తులు ఇంకా చేరుకోకముందే పరిస్థితులు, ఏర్పాట్లు అధ్వాన్నంగా ఉన్నాయని కిషన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేరళ ఎంపీలు కేంద్రం దృష్టికి తీసుకొచ్చిన సమస్యలపై కేరళ ముఖ్యమంత్రితో చర్చించబోతున్నట్టు తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన భద్రతా సిబ్బంది, మౌలిక వసతులు, కనీస ఏర్పాట్లు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున ప్రసాద్ పథకం ద్వారా మౌలిక వసతులు కల్పిస్తామంటే అక్కడి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు.

సీపీఎం ప్రభుత్వం సహాయ నిరాకరణ  చేస్తోందని దుయ్యబట్టారు. అయ్యప్పస్వామి భక్తులకు మౌలికవసతులు కల్పించడం, తొక్కిసలాటలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కేరళ సీఎంను కోరారు. ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ విషయంలో తమ వంతు పాత్రను పోషించాలని పిలుపునిచ్చారు. భక్తులు కూడా సంయమనంతో ఉండాలని, సహకరించాలని అభ్యర్థించారు.

కేరళ ప్రభుత్వం ఏ సహాయం కోరినా అందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక ట్రైన్లను కూడా నడుపుతున్నామని, భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాలని కేరళ ప్రభుత్వాన్ని కోరారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు సీపీఎం ప్రభుత్వం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరి కాదని కిషన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement