Thursday, May 30, 2024

Delhi |ఇంచార్జిలను మార్చడం కాదు.. సీఎంని మార్చాలని ప్రజల కోరిక: బీజేపీ

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంచార్జులను మార్చినా ఫలితం లేదని, ప్రజలు ముఖ్యమంత్రినే మార్చాలని నిర్ణయించుకున్నారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఏపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్‌ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన తాజా తుఫాను కారణంగా రైతులకు జరిగిన నష్టాన్ని నివారించడంలో, రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.

సీఎం జగన్ పాలనపై ప్రజలు నమ్మకం కోల్పోయారని, ఎన్నికలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారని భానుప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ అంటేనే అన్నపూర్ణ అనే పేరుండేదని, కానీ ఇప్పుడు అంధకార ప్రదేశ్‌గా మారిపోయిందని అన్నారు. “నేను ఉన్నాను – నేను విన్నాను” అంటూ మాటలు చెప్పే సీఎం జగన్‌కు రైతుల కన్నీరు కనిపించడం లేదా.. వారి ఆర్తనాదాలు వినిపించడం లేదా అని ప్రశ్నించారు. రైతుల కన్నీరు రాష్ట్రానికే కాదు దేశానికీ అరిష్టమని, సాక్షాత్తూ వెంకటేశ్వర స్వామికి నైవేద్యం పెట్టేది కూడా రైతన్నలు పండించిన పంటతోనే అని గుర్తుచేశారు.

- Advertisement -

చేతికి అందాల్సిన పంట నాశనమైందని, ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ధాన్యాన్ని గోదాముల్లో భద్రపరిచి ఉంటే అది తడిసిపోకుండా కాపాడి ఉండేవాళ్లమని అన్నారు. చెప్పులు కూడా తడవకుండా వరద ప్రాంతాలను సందర్శించే ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని భానుప్రకాశ్ రెడ్డి విమర్శించారు. పెళ్లికి వెళ్లినట్టు టెంట్లు, రెడ్ కార్పెట్లు ఏర్పాటు చేసుకుని మరీ వెళ్లారని, కానీ ఏ ఒక్క రైతునూ ఆయన పరామర్శించలేదని దుయ్యబట్టారు. తడి శాతం ఎక్కువగా ఉందని మిల్లర్లు ధాన్యాన్ని సేకరించకుండా తిరస్కరిస్తున్నారని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ కింద నిధులు మంజూరు చేసిందని, వరద నష్టాన్ని అంచనా వేయడం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక పరిశీలన బృందాలు ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్నాయని భానుప్రకాశ్ రెడ్డి తెలిపారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఎంతమేర పంట నష్టం జరిగిందో స్వయంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సూచించారు. నష్టపోయిన రైతన్నలకు ప్రతి ఎకరాకు రూ. 50 వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫసల్ బీమా యోజన పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన ప్రీమియం కూడా చెల్లించలేదని, అందుకే రైతులకు బీమా సైతం అందకుండా పోయిందని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులను ఆదుకోవడంలో విఫలమైన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement