Saturday, May 11, 2024

తెలంగాణ అసెంబ్లీలో కరోనా కలకలం

తెలంగాణ శాస‌న‌మండ‌లిలో కరోనా కలకలం రేపింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇవాళ ఉద‌యం అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో నిర్వ‌హించిన క‌రోనా ప‌రీక్ష‌ల్లో స‌తీష్‌కు పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. శ‌నివారం రోజు ఎమ్మెల్సీ స‌తీష్‌.. మండ‌లికి హాజ‌రై బ‌డ్జెట్‌పై మాట్లాడారు. దీంతో మిగ‌తా మండ‌లి స‌భ్యులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. స‌భ్యులంద‌రూ క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించుకోవాల‌ని చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి సూచించారు.

మరోవైపు రాష్ట్రంలోనూ కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.  తాజా కరోనా బులెటిన్ ప్రకారం 24 గంటల్లో 337 మందికి కరోనా సోకినట్టు బులెటిన్ లో పేర్కొన్నారు. దేశంలో, రాష్ట్రంలో క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంపై స‌ర్వత్రా ఆందోళ‌న వ్య‌క్తం అవుతుంది. కేసుల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరుగుతున్న నేప‌థ్యంలో తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల‌ను కుదించాల‌ని ప్ర‌భుత్వం యోచిస్తుంది. భారీగా బందోబ‌స్తు చేయాల్సి రావ‌టం, అధికారులంతా అసెంబ్లీకి హ‌జ‌రుకావాల్సి ఉండ‌టం, నేత‌లంతా ఒకే చోటుకు చేరాల్సి వ‌స్తున్నందున‌… కేసుల భ‌యంతో స‌‌ర్కారు ఈ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

ముందుగా నిర్ణ‌యించిన ప్ర‌కారం ఈనెల 26వ‌ర‌కు అసెంబ్లీ స‌మావేశాలు సాగాల్సి ఉంది. అయితే… ఈనెల 24నే ద్ర‌వ్య వినిమ‌య బిల్లు పెట్టి, అసెంబ్లీని వాయిదా వేయాల‌ని ఆలోచిస్తున్నారు. స్పీక‌ర్ అధ్యక్ష‌త‌న బీఏసీ స‌మావేశ‌మై దీనిపై తుది నిర్ణ‌యం తీసుకునే అవకాశం కనపడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement