Friday, May 17, 2024

మేరిపోల్‌లో మారణకాండ, డ్రామా థియేటర్‌పై రష్యా దాడులు

ఉక్రెయిన్‌పై రష్యా సైనికదాడులు కొనసాగుతూనే ఉన్నాయి. 22వ రోజు కూడా భీకర క్షిపణులు విరుచుకుపడ్డాయి. మేరిపోల్‌, కీవ్‌ సహా పలు నగరాలపై గురువారం బాంబుల వర్షం కురిసింది. మేరిపోల్‌లోని డ్రామా థియేటర్‌పై మాస్కో బలగాలు బాంబులు విసిరాయి. నగరంలోని దవాఖానను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న 400 మంది పౌరులు, 100 మంది వైద్యులు, రోగులను నిర్బంధించారు. చెర్నిగివ్‌లో జరిగిన బాంబుదాడిలో ముగ్గురు చిన్నారుల సహా ఐదుగురు మరణించారు. తూర్పు ఉక్రెయిన్‌ పట్టణమైన మెరెఫాలో పుతిన్‌ సేనలు జరిపిన కాల్పుల్లో 21 మంది మరణించారు. ఫిరంగి కాల్పుల్లో పాఠశాల, సాంస్కృతిక కేంద్రం దెబ్బతిన్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఓవైపు శాంతి చర్చల్లో పురోగతి కనబడుతోందంటూనే రష్యా దాడులు కొనసాగిస్తోంది.

దద్దరిల్లిన మేరిపోల్‌

వేలాది మంది శరణార్థులు తలదాచుకుంటున్న మేరిపోల్‌ డ్రామా థియేటర్‌పై బాంబు దాడి జరిగింది. ఆ దాడిలో వందల సంఖ్యలో జనం శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మృతుల వివరాలు వెల్లడవలేదు. ఈ దాడిని ఎన్నటికీ మరిచిపోలేమని మారిపోల్‌ సిటీ కౌన్సిల్‌ తెలిపింది. సమీప ప్రాంతాల్లో భారీగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో డ్రామా థియేటర్‌లో ఎంత మంది చనిపోయారో ఇప్పుడే తేల్చలేమని అధికారులు పేర్కొన్నారు. ధ్వంసమైన థియేటర్‌ బిల్డింగ్‌కు చెందిన ఫోటోను అధికారులు రిలీజ్‌ చేశారు. థియేటర్‌లోని మధ్య భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఆ శిథిలాల నుంచి తెల్లటి పొగ వస్తున్న దృశ్యాలు కనిపించాయి. విమానం నుంచి ఆ బిల్డింగ్‌పై బాంబు దాడి చేసినట్లు అధికారులు వెల్లడించారు. రష్యా సైన్యం అత్యంత నీచమైన, కిరాతకమైన దాడికి పాల్పడుతున్నట్లు ఉక్రెయిన్‌ అధికారులు ఆరోపించారు. దాడికి ముందు, తర్వాత ఫోటోలను ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ మంత్రి మిడిత్రో కులేబా తన ట్విట్టర్‌లో రిలీజ్‌ చేశారు. రష్యా యుద్ధ నేరాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. డ్రామా థియేటర్‌ వద్ద ఎక్కువ సంఖ్యలో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు కొన్ని వీడియోల ద్వారా స్పష్టమవుతోంది. మారిపోల్‌లో డ్రామా థియేటర్‌ శరణార్థులకు ఓ షెల్టర్‌గా నీడనిస్తోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం 1000 లేదా 1200 మంది ఆ థియేటర్‌లో షెల్టర్‌ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement