Sunday, February 25, 2024

Delhi | మధ్యప్రదేశ్ విజయం చారిత్రాత్మకం.. : మురళీధర్ రావు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: మధ్యప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) గెలుపు చారిత్రాత్మకం అని ఆ పార్టీ సీనియర్ నేత, రాష్ట్ర ఇంచార్జి మురళీధర్ రావు అన్నారు. ఆదివారం జరిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల లెక్కింపులో మధ్యప్రదేశ్‌తో పాటు చత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా బీజేపీ ఘన విజయం సాధించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. దాదాపు 2 దశాబ్దాలుగా అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వ వ్యతిరేకతను లేకపోగా.. అనుకూలతను కొనసాగించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని అన్నారు.

గుజరాత్ తర్వాత వరుసగా గెలుస్తూ వచ్చిన రాష్ట్రంగా మధ్యప్రదేశ్ రికార్డుల్లోకి ఎక్కిందని అన్నారు. రెండు దశాబ్దాల తర్వాత కూడా అధికారాన్ని బీజేపీ కొనసాగించగల్గితే, కాంగ్రెస్ మాత్రం ఒక పర్యాయం అధికారంలో ఉంటే మరోసారి కొనసాగించలేకపోతోందని అన్నారు. మధ్యప్రదేశ్ విజయం మోదీ నాయకత్వం, బీజేపీ నేతలు, కార్యకర్తల సమష్టి కృషి ఫలితం అని వ్యాఖ్యానించారు. చత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ సంక్షేమం, అభివృద్ధి ప్రజామోదం పొందడం పొందలేకపోయాయని, ఆ విషయాన్ని గ్రహించి తాము చేసిన పోరాటాలు ఫలించాయని తెలిపారు.

చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్ రాష్ట్రాల్లో చివరిక్షణం వరకు ఓటమి అంగీకరించకుండా పోరాటం చేశామని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో 2018లో ఓట్ల శాతం ఎక్కువగానే సాధించినా సీట్లు సాధించలేకపోవడానికి కారణాలేంటో తెలుసుకున్నామని, లోటుపాట్లు, లోపాలను సరిదిద్దుకుంటూ ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లామని తెలిపారు. బీజేపీ నుంచి దూరమైన దళితులపై దృష్టి పెట్టి, సంత్ రవిదాస్ మందిరం ఏర్పాటు సహా అనేక కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. గిరిజన-ఆదివాసీల విషయంలో పైసా యాక్ట్, సంత్ రఘునాథ్ షా, రాణీ దుర్గావతి కార్యక్రమాలతో వారికి దగ్గరయ్యామని చెప్పారు.

గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం కావడంతో అనుకూల ఫలితాలు వచ్చాయని తెలిపారు. లాడ్లీ బెహనా యోజన తదితర సంక్షేమ పథకాల కారణంగా మహిళలు మూకుమ్మడిగా శివరాజ్ ప్రభుత్వాన్ని సమర్థించారని సూత్రీకరించారు. జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరడాన్ని కూడా బలంగా మలచుకోవడం వల్ల ఇంత భారీ విజయం సాధ్యపడిందని తెలిపారు. పార్టీలో అంతర్గత విబేధాలను సరిదిద్దుకుంటూ ముందుకెళ్లి భారీ విజయాన్ని నమోదు చేసుకోగలిగామని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల కంటే మోదీ, శివరాజ్ సింగ్ ఇచ్చిన గ్యారంటీలను ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్ ముందుకెళ్లలేదని మురళీధర్ రావు ఎద్దేవా చేశారు. బీజేపీని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ గెలవలేకపోతోందని, బీజేపీ – కాంగ్రెస్ మధ్య పోటీ ఉన్న చోట బీజేపీనే ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోందని అన్నారు.

ప్రజలు పట్టం కట్టారు అనుకోవద్దు

దక్షిణ భారతదేశం మొత్తాన్ని కలిపి బీజేపీ లేదని చెప్పడాన్ని తాను ఒప్పుకోనన్నారు. కర్ణాటకలో ఓడిపోయినప్పటికీ తాము అక్కడ ఇప్పటికీ బలంగానే ఉన్నామని, మళ్లీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో తెలంగాణలో ఓట్లు గణనీయంగా పెరిగాయని, సీట్లు కూడా కొన్ని పెరిగాయని తెలిపారు. తెలంగాణలో బీఆర్ఎస్‌ ఓటమికి ప్రధాన కారణం బీజేపీ చేసిన పోరాటాలేనని, కానీ ఆ వ్యతిరేకతను బీజేపీ అనుకూలంగా మలచుకోలేకపోయిందని తెలిపారు. ఎందుకు ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయాం అన్నది విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

నాయకత్వం కారణమా.. అభ్యర్థుల ఎంపిక కారణమా.. బీసీ ముఖ్యమంత్రి, ఎస్సీ వర్గీకరణ నినాదాల ప్రభావం ఎంత.. జనసేనతో పొత్తు ఉపయోగపడిందా.. లేదా.. అన్నవి లోతుగా సమీక్షించుకుని, విశ్లేషించుకుంటామని అన్నారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 7 శాతం ఓట్లతో 4 సీట్లు గెలిచామని, మొత్తం 17 సీట్లలో ఇది 20 శాతం అని గుర్తుచేశారు. ఇప్పుడు అసెంబ్లీలో 18 శాతం ఓట్లు సాధించామని, పార్లమెంటు ఎన్నికల సమయానికి ఇంకెంత ముందుకెళ్తాం అన్నది కూడా చూడాలని అన్నారు. తెలంగాణ బీజేపీ టార్గెట్ స్టేట్ అని పేర్కొన్న మురళీధర్ రావు, బీజేపీ పనితీరు మరింత మెరుగుపడుతుందని తెలిపారు.

బీఆర్ఎస్ – బీజేపీ ఒక్కటే అన్న ప్రచారం చేయడానికి కూడా కాంగ్రెస్‌కు ఆస్కారం ఉండదని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బొటాబొటీ మెజారిటీతోనే గెలిచిందన్న విషయం మర్చిపోవద్దని అన్నారు. ప్రజలు పట్టం కట్టారు అనుకోడానికి వీల్లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఆకాశాన్ని వాగ్దానం చేసిందని, బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకుంటామని చెప్పిందని, అవి ఎంతమేర అమలు చేస్తుందో చూడాలని అన్నారు. వీటిపై ప్రశ్నిస్తూ, పోరాడుతూ ముందుకెళ్లడంలో బీజేపీకి ఉన్నంత అవకాశం ఇంకెవరికీ ఉండదని మురళీధర్ రావు అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement