Sunday, May 19, 2024

Followup: బీఆర్ఎస్ కార్యాలయం సందర్శించిన కేసీఆర్.. కొన్ని మార్పులు చేపట్టాలని సూచన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చుతూ జాతీయ రాజకీయాల్లోకి నేరుగా అడుగుపెట్టేందుకు సిద్ధమైన తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మంగళవారం ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. సర్ధార్ పటేల్ మార్గ్‌లోని ఖేత్రి ట్రస్ట్ భవన్‌ను అద్దె ప్రాతిపదికన తీసుకుని, బీఆర్ఎస్ జాతీయ ప్రధాన కార్యాలయంగా వినియోగించుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఆ భవనంలో పెయింటింగ్ సహా కొన్ని మరమ్మతు పనులు జరుగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం ఉత్తర్‌ప్రదేశ్‌లో ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలకు హాజరైన సీఎం కేసీఆర్, అక్కణ్ణుంచి నేరుగా ఢిల్లీలోని తన అధికారిక నివాసానికి చేరుకున్నారు.

అనంతరం సాయంత్రం గం. 5.20 సమయంలో ఎస్పీ మార్గ్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించిన కేసీఆర్, వాస్తు ప్రకారం చేయాల్సిన మార్పులు, చేర్పులను సూచించారు. అలాగే ఏడాది పాటు ఈ భవనాన్ని లీజుకు తీసుకునేలా సిద్ధం చేసిన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసినట్టు తెలిసింది. నిజానికి ఢిల్లీలోని వసంత్ విహార్ ప్రాంతంలో టీఆర్ఎస్ పార్టీ కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో భూమిపూజ నిర్వహించి భవన నిర్మాణ పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే. సొంత భవనం నిర్మాణం పూర్తయ్యే వరకు పార్టీ కార్యాకలాపాలు నిర్వహించేందుకు ఖేత్రి ట్రస్ట్‌కు చెందిన భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చాలంటూ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు కూడా చేశారు. ఈ ప్రక్రియ కొనసాగుతుండగానే పార్టీ కార్యాలయాన్ని అద్దె భవనంలో సిద్ధం చేసి, జాతీయస్థాయి ప్రణాళికలు అమలు చేసేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement