Sunday, March 24, 2024

కరుణ్‌ నాయర్‌ భావోద్వేగ ట్వీట్‌

భారత టి 20 లీగ్‌, దేశీయ క్రికెట్‌ను అనుసరించే అభిమానులకు కరుణ్‌ నాయర్‌ పరిచయం అక్కరలేని పేరు. టెస్ట్‌ మ్యాచుల్లోనూ ఈ ఆటగాడు అదరగొట్టాడు. 2016 చెన్నయ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టుల్లో 303 పరుగులు చేసిన రికార్డుతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. వీరేంద్ర సెహ్వాగ్‌ తర్వాత త్రిశతకం సాధించిన భారత ఆటగాడిగా అప్పట్లో ఇతడి పేరు మారు మ్రోగిపోయింది. భవిష్యత్తులో స్టార్‌ ఆటగాడిగా ఎదుగుతాడని అంతా భావించారు. కానీ 2017లో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో వరుస వైఫల్యాలు అతడిని కుదిపేశాయి.

టెస్ట్‌ జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత దేశం తరపున కరుణ్‌ ఆడలేదు. సుదీర్ఘకాలం జట్టులో అవకాశాలు ఇవ్వకపోవడానికి గల కారణాలపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌ తనకు ఎలాంటి వివరణ ఇవ్వలేదని ఈ ఆటగాడు గతంలో ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో దేశవాళీ క్రికెట్‌లో కర్ణాటక జట్టు తరపున కొనసాగాడు కానీ కొంతకాలం తర్వాత ముస్తాక్‌ అలీ ట్రోఫీ, విజయ హజారే ట్రోఫి వంటి రాష్ట్ర స్థాయి జట్టుల్లో కూడా ఇతడికి చోటు దక్కలేదు.

ఈ నేపథ్యంలో కరుణ్‌ ట్విట్టర్‌ వేదికగా భావోద్వేగ పోస్టును పంచుకున్నాడు. ” డియర్‌ క్రికెట్‌ .. నాకు మరొక్క అవకాశం ఇవ్వు” అంటూ పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారిన ఈ ట్వీట్‌ అభిమానులను కదిలించింది. క్రికెట్‌ వర్గాల్లో చర్చకు దారి తీసింది. ” సోదరా నీ త్రిశతకాన్ని మేమింకా మర్చిపోలేదు. నువ్వు కచ్చితంగా మళ్లిd నిరూపించుకుంటావు” అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు. తన కెరీర్‌లో 76 భారత టీ 20 లీగ్‌ మ్యాచుల్లో కరుణ్‌ ఆడాడు. 85 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచుల్లో దాదాపు 50 సగటుతో 5, 922 పరుగులు చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement