Sunday, December 10, 2023

Delhi | ఇస్రోకు నిధులిచ్చి ప్రోత్సహించాలి.. చంద్రయాన్‌పై చర్చలో విజయసాయి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఒక హిట్ సినిమా నిర్మాణానికయ్యే బడ్జెట్‌ కంటే తక్కువ ఖర్చుతో చంద్రయాన్‌ 3 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టి అంతరిక్ష ప్రయోగాల్లో భారత కీర్తి పతాకాన్ని ఎగరేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు కావలసినన్ని నిధులు కేటాయించి ప్రోత్సహించాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కేంద్రప్రభుత్వానికి సూచించారు. ‘భారత అంతరిక్ష యాత్రలో మహోజ్వల ఘట్టం – చంద్రయాన్‌ విజయం’ అన్న అంశంపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు.

భారత అంతరిక్ష కార్యక్రమాల కోసం కేవలం 2 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ మాత్రమే ఉందని, అదే అమెరికాకు చెందిన నాసాకు 62 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ ఉందని, అంటే ఇస్రో బడ్జెట్‌ కంటే అది 31 రెట్లు అధికమని ఆయన వివరించారు. తక్కువ వ్యయంతోనే ప్రపంచం అబ్బురపడే అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్న ఇస్రోకు దండిగా నిధులు సమకూర్చితే ఇంకా ఎలాంటి అద్భుతాలు సృష్టించగలదో నిరూపిస్తుందని విజయసాయి రెడ్డి అన్నారు.

- Advertisement -
   

2023-24 కేంద్ర బడ్జెట్‌లో అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనలకు కేటాయించిన మొత్తంలో 8 శాతం కోత పెట్టడం ఎంతమాత్రం సమంజసం కాదని ఆక్షేపించారు. సెంట్రల్‌ సెక్టర్‌ స్కీమ్‌లలో అత్యధికంగా కోతకు గురైనది అంతరిక్ష పరిజ్ఞాన రంగం బడ్జెట్‌ అని ఆయన చెప్పారు. వైజ్ఞానిక మేధను చెరబట్టిన చరిత్ర కాంగ్రెస పార్టీదని విజయసాయి రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంలోను, కేరళలోను అధికారంలో ఉన్న కాలంలో గూఢచర్యం పేరిట ప్రసిద్ధ అంతరిక్ష శాస్త్రవేత్త నంబి నారాయణన్‌పై తప్పుడు కేసులు బనాయించి ఆయనను 50 రోజులపాటు జైలులో నిర్బంధించి, తీవ్రంగా హింసించిందని ఆరోపించారు.

రాజకీయ కారణాలతో అప్పటి అధికార కాంగ్రెస్‌ అనేకమంది సైంటిస్టులను వేధింపులకు గురిచేస్తూ ప్రతీకార చర్యలకు పాల్పడినందు వలన అంతరిక్ష పరిశోధనలు, ప్రయోగాల రంగంలో దేశం ఆశించినంత పురోగతిని సాధించలేకపోయిందని ఆయన దుయ్యబట్టారు. దేశీయంగా పెరుగుతున్నఅంతరిక్ష కార్యక్రమాల అవసరాలకు తగినట్లుగా మానవ వనరులను సమకూర్చుకోవాలంటే తిరువనంతపురంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ స్పేస్‌ సైన్సెస్‌ (ఐఐఎస్‌టి) సంస్థలు దేశంలో మరిన్నింటిని స్థాపించాలని ఆయన ప్రధానమంత్రికి సూచించారు. శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఆకర్షణీయమైన ఉద్యోగ అవకాశాలు కల్పించి ఐటీ వలసలను నియంత్రించే చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

చంద్రబాబు ప్రకటనలపై రాయల్టీ

1962 నుంచి అంతరిక్ష పరిశోధనలను తమ పార్టీ ఎంతో ప్రోత్సహించిందని కాంగ్రెస్‌ చెబుతుంటే 2014 నుంచి మేం అందించిన సహకారంతోనే ఇస్రో ఇన్ని ఘన విజయాలు సాధించిందని బీజేపీ చెప్పుకుంటోందన్న ఆయన, వీళ్ళిద్దరి మధ్య అనేక వినూత్న ఆవిష్కరణలకు నాంది పలికినట్లు చెప్పుకునే ముఖ్యమైన మూడో వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడని ఎద్దేవా చేశారు.

ఐటీ విప్లవం తీసుకువచ్చానని, కంప్యూటర్‌ను, సెల్‌ ఫోన్‌ను తానే కనిపెట్టానని ఆయన ఇప్పటికే వందలసార్లు చేసిన ప్రకటనలపై కేంద్ర ప్రభుత్వం విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఐటీ, కంప్యూటర్లు, సెల్‌ ఫోన్‌ ఆవిష్కరణల సృష్టికర్త ఆయనే అని రుజువైతే వాటిపై భారత్‌ పేటెంట్‌ హక్కులు పొందవచ్చని, తద్వారా ఆ పేటెంట్‌లను వినియోగించుకుంటున్న ఐటీ కంపెనీలు, కంప్యూటర్‌ తయారీ కంపెనీలు, సెల్‌ ఫోన్‌ కంపెనీల నుంచి వేల కోట్ల రూపాయలను రాయల్టీ కింద రాబట్టవచ్చని విజయసాయి ప్రభుత్వానికి సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement