Sunday, April 28, 2024

Investigation – సీఎం జగన్​ రాయి కేసులో పురోగతి…..

ఓ వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
సింగ్​నగర్ వడ్డెర కాలనీ యువకుడిగా గుర్తింపు
మరో నలుగురిని ప్రశ్నిస్తున్న దర్యాప్తు బృందం
15 మంది మైనర్లు స్టేషన్​కు తరలింపు
పదునైన టైల్స్​ రాయి విసిరాడని నిర్ధారణ
మొబైల్ క్లిప్పింగ్స్‌తో దొరికిన ఆధారాలు
రూ. 2లక్షల నజరానా ఫలితమేనా?
నిందితుడు మైనరని ప్రచారం
సీఎంపై రాయి దాడి కేసులో విచార‌ణ వేగ‌వంతం
సింగ్‌న‌గ‌ర్ వ‌డ్డెర కాల‌నీలో ఆందోళ‌న‌
పోలీసు స్టేష‌న్ వ‌ద్ద బాలుర కుటుంబాల క‌న్నీరు

ఆంధ్రప్రభ స్మార్ట్, విజయవాడ ప్రతినిధి: – ఏపీలోనే కాదు.. జాతీయ స్థాయిలో తీవ్ర సంచలనం రేపిన సీఎం జ‌గ‌న్‌పై రాయి దాడి (హత్యాయత్నం) కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. అయితే సోషల్​ మీడియాలో మాత్రం పోలీసుల అదుపులో నిందితుడు ఉన్నట్టు ప్రచారం జరగుతోంది. మంగళవారం ఉదయమే అతడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. జగన్‌పై ఎందుకు రాయి విసిరాడో తెలుసుకునే పనిలో దర్యాప్తు అధికారులు నిమగ్నమయ్యారు. రూ. 2 లక్షల బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించిన కొన్ని గంటల్లోనే నిందితుడి సమాచారం పోలీసులకు చేరటం, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోవటం జరగిపోయింది.

- Advertisement -

స్థానికులు తమ మొబైల్స్​లో తీసిన వీడియోల ఆధారంగా అయిదుగురు అనుమానితులను పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. వారందరినీ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్టు సమాచారం అందుతోంది. వీరిలో ఒకరు మాత్రమే అసలైన నిందితుడని తెలుస్తోంది. అజిత్​సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీశ్​కుమార్​గా ప్రచారం జరుగుతోంది. అతనితో పాటు ఆకాష్, దుర్గారావు, చిన్ని, సంతోష్ అనే యువకులు కూడా ఘటనాస్థలిలో ఉన్నట్టు తెలుసుకుని వారిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇక.. రాయితో దాడికి గల కారణాలను పోలీసులు తెలుసుకొంటున్నారు. ఇదిలా ఉంటే.. జగన్​పై దాడి చేశాడని అనుమానిస్తున్న సతీశ్​ మైనర్ అని మరో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, ఈ విషయంలో పోలీసులు మాత్రం ఎలాంటి విషయాలను బయటికి చెప్పడం లేదు. నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం కూడా నిర్ధారించలేదు.

అందరూ మైనర్లే

సీఎం జగన్​పై రాయి దాడి కేసులో అనుమానితులు అయిదుగురిని పోలీసులు విచారణ జరుపున్నట్టు తెలుస్తోంది. కాగా, ఫుట్ పాత్ టైల్స్ రాయి ముక్కతో ఈ దాడి చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. నిందితుడు అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన మైనర్​ అని తెలుస్తోంది. ఈ ఘటనపై ఐజీ రవిప్రకాష్, పోలీస్​ కమిషనర్ క్రాంతి రాణా టాటా సమర్పించిన ప్రాథమిక నివేదకను సీఈవో ముఖేష్ కుమార్​ మీనా పరిశీలించారు. త్వరగా కేసును పరిష్కరించాలని ఆదేశించారు. ఇప్పటికే దర్యాప్తులో ఉన్న 8 టాస్క్ ఫోర్స్​ బృందాలు స్థానికంగా అనుమానితుల కోసం అన్వేషణ జరిపారు. సాంకేతిక పరిజ్ఙానాన్ని వినియోగించి అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది.

వడ్డెర కాలనీలో అలజడి

విజయవాడలోని సింగ్​నగర్​ వడ్డెరకాలనీలో అలజడి రేగింది. జగన్​పై రాయి దాడి ఘటనలో నలుగురు మైనర్లు పాల్గొన్నారని పోలీసులకు వీడియో సమాచారం అందినట్టు సమాచారం. దీంతో మంగళవారం తెల్లవారుజామునే పోలీసు బలగాలు వడ్డెర కాలనీకి చేరుకున్నాయి. అనుమానితులు సతీష్, ఆకాష్, దుర్గారావు, చిన్ని, సంతోష్సహా 15 మంది మైనర్లను వ్యానుల్లో తరలించారు. వీరందరినీ వన్ టౌన్ పోలీసు స్టేషన్​కు తీసుకెళ్లినట్టు సమాచారం. దీంతో వడ్డెర కాలనీ కుటుంబాలు కూడా పోలీసు స్టేషన్​కు చేరుకున్నాయి. అయితే.. అక్కడ తమ పిల్లల జాడ తెలియక పోవటంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

మా పిల్లలు అలాంటి వారు కాదు..

తమ పిల్లలు ఆకతాయిగా కూడా రాళ్లు విసిరే బ్యాచ్ కాదని వడ్డెర కాలనీ వాసులు కన్నీరుపెడుతున్నారు. ఇలాంటి చేష్టలు చేయరని అంటున్నారు. ఈ స్థితిలో విజయవాడలో బలహీన వర్గాల కాలనీలో తీవ్ర అలజడి ఆరంభమైంది. మరో వైపు పోలీసులు మాత్రం కచ్చిత ఆధారాలతోనే నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెబుతున్నారు. ఇదిలా ఉంటే రాయి విసిరిన ఘటనలో పోలీసులు అదుపులో తీసుకున్న సతీష్ కుమార్ అనారోగ్యంతో కాళ్లు, చేతులు చచ్చుపడ్డాయని మరో కథనం వినిపిస్తోంది. ఇంతకీ మీడియాలో హల్ చల్ అవుతున్న అయిదుగురు ఎవరు? వారు తమ పిల్లలేనా? ఎందుకు తీసుకు వెళ్లారని వడ్డెర కాలనీ వాసులు గగ్గోలు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement