Friday, May 17, 2024

రాజకీయ హింసలో అమాయకులు బలి.. రాజ్యసభలో రూపా గంగూలీ కన్నీరు

ప.బెంగాల్‌ బీర్భూమ్‌లో జరిగిన ఘటన తనను చాలా కలిచి వేసిందని, రాజకీయ హింసలో అమాయకులు బలవుతున్నారంటూ రాజ్యసభలో పశ్చిమ బెంగాల్‌ బీజేపీ ఎంపీ రూపా గంగూలీ కన్నీరు పెట్టుకున్నారు. హింసాకాండను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. బెంగాల్‌ను కాపాడాలని ఈ సందర్భంగా కోరారు. ప.బెంగాల్‌లో రాష్ట్రపతి పాలనే మంచిదంటూ అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఇదొక రాజకీయ హింస అని, ఈ ఘటనలో సాధారణ జనం ప్రాణాలు కోల్పోయారని, ఏ పార్టీ నేతకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని చెప్పుకొచ్చారు. ఎంతో మంది ఇళ్లను వదిలి పారిపోవాల్సిన పరిస్థితి ప.బెంగాల్‌లో నెలకొందని విమర్శించారు.

జీరో అవర్‌లో బీర్భూమ్‌లో జరిగిన హింసాకాండను ఆమె ప్రస్తావించారు. 8 మంది అమాయకులు సజీవ దహనం అయ్యారని రూపా ఏడుస్తూ వివరించారు. ఆమె మాట్లాడుతున్న సమయంలో టీఎంసీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. అమాయకులపై ముందు దాడులు చేశారని, కదల్లేని పరిస్థితుల్లో ఉన్న వారిని ఇంట్లో బంధించి నిప్పు పెట్టారన్నారు. ప.బెంగాల్‌ భారతదేశంలో ఓ భాగమని చెప్పుకొచ్చిన రూపా.. ఇక్కడ పుట్టడం నేరమా అని ప్రశ్నించారు. కాళీ మాత నేలపై ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు. మనం మనషులమని చెప్పిన రూపా.. ఇలాంటి రాజకీయాలు చేయమంటూ టీఎంసీని ఉద్దేశిస్తూ విమర్శించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement