న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో వెనుకబడిన తరగతులు (బీసీ) జాబితాలో ఉన్నప్పటికీ జాతీయస్థాయిలో ఓబీసీ జాబితాలో చోటులేని తూర్పుకాపులు, కళింగ వైశ్యులు, శిష్టకరణాలు, సోండి కులాలపై జాతీయ బీసీ కమిషన్ కీలక సిఫార్సులు చేసింది. ఈ కులాలను జాతీయస్థాయిలో ఓబీసీ జాబితాలో చేర్చాల్సిందిగా సిఫార్సు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి నివేదికను అందజేసింది.
సుదీర్ఘకాలంగా పెండింగులో ఉన్న ఈ డిమాండ్‌ను నెరవేర్చే క్రమంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు చొరవ తీసుకుని ప్రయత్నాలు సాగించారు. ఆయా కులాల నేతలను ఢిల్లీకి తీసుకొచ్చి కేంద్ర పెద్దలతో మంతనాలు సాగించారు. జాతీయ బీసీ కమిషన్‌కు అవసరమైన సమాచారాన్ని అందజేసి, పబ్లిక్ హియరింగ్ నిర్వహించేలా చొరవ చూపారు. బీసీ కమిషన్ కూలంకశంగా ఈ కులాల డిమాండ్లపై అధ్యయనం చేసి సానుకూలంగా స్పందించింది.
మంగళవారం ఈ విషయం తెలుసుకున్న ఎంపీ జీవీఎల్, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్‌రాజ్ గంగారాం ఆహిర్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. జాతీయస్థాయిలో ఓబీసీ జాబితాలో ఏ కులాన్నైనా కొత్తగా చేర్చాలంటే జాతీయ బీసీ కమిషన్ సిఫార్సులు తప్పనిసరి. ఆంధ్రప్రదేశ్ జనాభాలో 40 లక్షలకు పైగా వున్న తూర్పుకాపులు, కళింగ వైశ్యులు, శిష్టకరణాలు, సొండి కులాలకు కేంద్ర ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని చాలాకాలంగా కోరుతున్నారు.
జాతీయస్థాయిలో ఓబీసీ జాబితాలో చేర్చకపోవడం వల్ల ఈ కులాలకు చెందినవారు కేంద్ర విద్యాసంస్థలు, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల ఫలాలు పొందలేకపోతున్నారని, తద్వారా తీవ్ర అన్యాయానికి గురవుతున్నారని ఎంపీ జీవీఎల్ పలుమార్లు జాతీయ బీసీ కమిషన్‌తో పాటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పార్లమెంటులోనూ ఈ అంశాన్ని లేవనెత్తుతూ వచ్చారు. జాతీయ బీసీ కమిషన్ సిఫార్సు తర్వాత జీవీఎల్ స్పందిస్తూ.. “కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్ర విద్యాసంస్థల్లో ఈ అత్యంత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు సాధించడానికి జాతీయ బీసీ కమిషన్ సిఫార్సు ఒక పెద్ద ముందడుగు” అని వ్యాఖ్యానించారు.