Friday, May 3, 2024

Over Action | మీ పేరెంట్స్​ నాకు ఓటేయకుంటే తిండి మానేయాలి.. స్కూల్​ పిల్లలతో ఎమ్మెల్యే

మీ తల్లిదండ్రులు నాకు ఓటు వేయకపోతే రెండు రోజులు తినొద్దని, వారిని ఇబ్బంది పెట్టాలని స్కూల్‌ పిల్లలను ఒక ఎమ్మెల్యే కోరాడు. అలాగే తన పేరును పలుమార్లు వారితో చెప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆ ఎమ్మెల్యే తీరుపై ప్రతిపక్ష పార్టీల నేతలు భగ్గుమంటున్నారు. మహారాష్ట్రలో ఈ ఘటన జరిగింది. సీఎం ఏక్‌నాథ్‌ షిండే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే సంతోష్ బంగర్ ఇప్పటి నుంచే ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాడు. తన నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో ఉన్న ప్రభుత్వ స్కూల్స్​ని సందర్శిస్తున్నాడు. ఈ సందర్భంగా స్కూల్‌ పిల్లలతో వింతగా మాట్లాడి వార్తల్లోకి ఎక్కాడు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మీ తల్లిదండ్రులు నాకు ఓటు వేయకపోతే రెండు రోజులు ఆహారం తీసుకోవద్దని స్కూల్‌ విద్యార్థులను ఎమ్మెల్యే సంతోష్ బంగర్‌ కోరాడు. ‘మీరు ఆహారం ఎందుకు తీసుకోవడం లేదని మీ తల్లిదండ్రులు అడిగితే, ‘సంతోష్ బంగర్’కు ఓటు వేయాలని చెప్పండి’ అని వారితో అన్నాడు. ఇది చూసి ఆయన వెంట ఉన్న నాయకులతోపాటు స్కూల్‌ టీచర్లు నవ్వుకున్నారు.

- Advertisement -

కాగా, ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో షిండే వర్గం సేన ఎమ్మెల్యే సంతోష్ బంగర్ తీరుపై అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్‌ నాయకుడు విజయ్ వాడెట్టివార్ మండిపడ్డారు. రాజకీయ ప్రచారానికి లేదా ఎన్నికల సంబంధిత పనులకు పిల్లలను వాడుకోవద్దని ఈసీ ఆదేశించినప్పటికీ అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఇది పట్టడం లేదని విమర్శించారు. విద్యాశాఖ మంత్రి నిద్రపోతున్నారా? అని ప్రశ్నించారు. అలాగే ఎమ్మెల్యే సంతోష్‌ బంగర్‌పై ఈసీ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement