Friday, May 17, 2024

సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే, ఉత్తమ ఫలితాలు సాధించొచ్చు.. పరీక్షా పే చర్చలో మోడీ

సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఉత్తమ ఫలితాన్ని సాధించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు. దీనివల్ల జీవితంలో పొందాల్సిన దానికంటే ఎక్కువ పొందవచ్చని అన్నారు. శుక్రవారం తల్కతోరా స్టేడియం నుంచి పరీక్షాపే చర్చా – 2022 కార్యక్రమంలో ప్రధాని విద్యార్థులతో నేరుగా మాట్లాడారు. ఈ కార్యక్రమానికి 12.12 లక్షల మంది విద్యార్థులు, 2.71 లక్షల మంది ఉపాధ్యాయులు, 90 వేల మంది తల్లిదండ్రులు పేర్లు నమోదు చేసుకున్నారు. పరీక్ష కి బాత్‌.. పీఎం కే సాథ్‌ అనే నినాదంతో 5వ పరీక్ష పే చర్చ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు. పరీక్షలకు ముందు ఎదురయ్యే సమస్యలు, పరీక్షలకు సిద్ధమయ్యే విధానాలు, ఒత్తిడిని తట్టుకోగలగడం వంటివాటి గురించి మాట్లాడారు. మీ లక్ష్యం గరిష్ట లక్ష్యాలు అయివుండాలి. 18 గంటలు కష్టపడం అంటే ఉత్తమమైన ఫలితం వస్తుందని భావం కాదన్నారు. నేర్చుకోవడంపై కాకుండా ఉత్తీర్ణత సాధించడం, మార్కులను పొందడంపై మాత్రమే మన దృష్టి ఉంటుందని చెప్పారు. పోటీల వల్ల జీవితం ప్రగతి సాధిస్తుందని చెప్పారు. మనం పోటీని ఆహ్వానిం చాలని, ప్రతి రంగంలోనూ పోటీ పడటానికి ప్రయత్నించాలని తెలిపారు. బాలికలను చదివించని సమాజం ఎన్నటికీ సౌభాగ్యవంతం కాబోదని తెలిపారు. గతంలో పెళ్లయిన తర్వాత బాలికలు స్థిరపడతారని అనుకునేవారని, వారి విద్యను నిర్లక్ష్యం చేసేవారని చెప్పారు. ఇది మారుతుండటం మంచి పరిణామమని తెలిపారు. మహిళా శక్తి లేకపోతే దేశం అభివృద్ధి సాధించదని మన తరానికి తెలుసునన్నారు. పరీక్షలు అభివృద్ధిలో చిన్న అడుగులు మాత్రమేనని, ఇవి జీవితంలో సులభమైన భాగమని గుర్తించాలన్నారు. ఆత్మవిశ్వాసం ఏర్పడినప్పుడు రాబోయే పరీక్షలకు ఈ అనుభవాలు మీకు బలం అవుతాయని ప్రధాని హితబోధచేశారు.

తల్లిదండ్రులకు సూచన..

విద్యార్థులు తరచూ సందిగ్ధంలో ఉంటారని, తమ కలలను నెరవేర్చుకోవాలా? తమ తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలా? అనే సందిగ్ధంలో ఉంటారని చెప్పారు. దీనివల్ల విద్యార్థులు అంతులేని అయోమయంలో కొట్టుమిట్టాడుతారని చెప్పారు. తమ పిల్లలకు దేనిమీద ఆసక్తి ఉందో తల్లిదండ్రులు తెలుసుకోవాలని, వారి బలాలను వారు తెలుసుకోవడానికి సాయపడాలని అన్నారు. తమ కలలను, ఆకాంక్షలను పిల్లలపై రుద్దకూడదని తల్లిదండ్రులు, టీచర్లను కోరారు. కాలంతోపాటు మారాలని సూచించారు. 20వ శతాబ్దంనాటి కాలం చెల్లిన భావాలు, విధానాలు 21వ శతాబ్దంలో అభివృద్ధికి మార్గదర్శకం కాబోవన్నారు. కాలంతోపాటు మనం మారాలన్నారు. సానుభూతి కోసం ఎన్నడూ చూడవద్దని చెప్పారు. ”మీ సమస్యలపై మీరే ఆత్మవిశ్వాసంతో పోరాడాల”ని తెలిపారు. ”మీ జీవితం నుంచి నెగెటివిటీని నిర్మూలించడానికి సవాళ్ళను ఎదుర్కొనాల”ని చెప్పారు.

ఆన్‌లైన్‌ విద్య..

ఆన్‌లైన్‌ విద్యకు ఆధారం విజ్ఞానాన్ని సంపాదించడమనే సిద్ధాంతమని తెలిపారు. ఆ విజ్ఞానాన్ని పటిష్టం చేసుకోవడం, ఆచరణలో వర్తింపజేయడానికి సంబంధించినది ఆఫ్‌లైన్‌ విద్య అని చెప్పారు. ఆన్‌లైన్‌లో నేర్చుకోవాలని, దానిని ఆఫ్‌లైన్‌లో ఉపయోగించుకోవాలని చెప్పారు. జాతీయ విద్యా విధానం 21 శతాబ్దపు ఆకాంక్షలను నెరవేర్చుతుం దన్నారు. ఇది భారత దేశాన్ని భవిష్యత్తులోకి తీసుకెళ్తుందన్నారు. ఈరోజుల్లో విజ్ఞానం మాత్రమే సరిపోదని, నైపుణ్యాన్ని కూడా సాధించాలని చెప్పారు. విజ్ఞానం, నైపుణ్యాల సమాహారంపై నూతన విద్యా విధానంలోని సిలబస్‌ దృష్టి పెట్టిందన్నారు. బాలల సత్తా గుర్తించాలిబాలల నిజమైన సామర్థ్యాలు, ఆకాంక్షలను మనం అర్థం చేసుకుని, శ్రద్ధగా ప్రోత్స#హంచనంత వరకు వారు తమ సంపూర్ణ సామర్థ్యాన్ని తెలుసుకోలేరన్నారు. ప్రతి బిడ్డ ఏదో ఒక ప్రత్యేక ప్రతిభతో పుడతారని చెప్పారు. మనం ఆ సత్తా, సామర్థ్యాలను గుర్తించాలని చెప్పారు.

- Advertisement -

ప్రేరణ సూత్రం..

మనం తరచూ ప్రేరణనిచ్చే ఇంజెక్షన్‌ కోసం లేదా ప్రేరణనిచ్చే సూత్రం కోసం చూస్తూ ఉంటాం. మనల్ని వెనుకకు లాగుతున్నదేమిటనే దానిని మనం మొదట చూడాలి, వాటిని దూరంగా ఉంచాలి అని ప్రధాని చెప్పారు. స్వీయ ప్రేరణ కోసం ఓ సరదా మార్గం ఉందన్నారు. అన్ని బాధలతో ఓ లేఖను రాయాలని చెప్పారు. మనసు పక్కదారి పట్టడం, నైరాశ్యానికి లోనవడం వంటివాటిని అర్థం చేసుకోవడానికి స్వీయ పరిశీలన అవసరమని చెప్పారు. పరీక్షల సమయంలో ప్రగతి దిశగా తీసుకెళ్ళగలిగే ప్రేరణ అవసరమని తెలిపారు. జ్ఞాపకశక్తి గొప్ప ఉత్ప్రేరకమని, ఇది మన జీవితం, నైపుణ్యాలను పదునుపెట్టుకోవడానికి దోహదపడుతుందని తెలిపారు. ఓ పాత్రలో ఓ నాణాన్ని పెట్టి, నీటిని పోసి, ఆ నీటిని బాగా కదిలించినపుడు, దానిలోని నాణం మనకు కనిపించదని,. మన జ్ఞాపకశక్తి కూడా అటువంటి దేనని ఉదహరించారు. స్నేహితులతో కలిసి తరగతి గదిలో నేర్చుకున్న వాటిని చర్చించుకునే అలవాటును పెంపొందుచుకోవాలని చెప్పారు.

నూతన విద్యావిధానం..

2014 నుంచి నూతన జాతీయ విద్యా విధానం పనిలో మేము నిమగ్నమై ఉన్నాం. దీనికోసం లోతైన మేథోమథనం జరిగింది. దేశంలోని పండితుల నాయకత్వంలో రూపొందించబడింది. ఇది సైన్స్‌ అండ్‌ టెక్నాలజీతో ముడిపడివుంది. ముసాయిదా తయారు చేశాక ప్రజల్నుంచి 15-20 లక్షల సలహాలు, సూచనలు వచ్చాయి. ఎంతో శ్రమ తర్వాత కొత్త విద్యావిధానం వచ్చింది. ప్రభుత్వం ఏంచేసినా ఎక్కడో ఒకచోట నిరసన స్వరం వినిపిస్తుంది. కానీ భారతదేశంలో ప్రతి విభాగంలోనూ జాతీయ విద్యావిధానం బలం పుంజుకోవడం సంతోషకరం. ఈ దిశగా కృషిచేసిన వారందరూ అభినందనీయులు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement