Sunday, June 9, 2024

మండలి ఛైర్మన్‌ పదవికి గుత్తా సుఖేందర్‌ రెడ్డి నామినేషన్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : శాసనమండలి ఛైర్మన్‌ పదవికి టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్‌ రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఆదివారం అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో సుఖేందర్‌ రెడ్డి నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. తనమీద ఉన్న నమ్మకంతో శాసనమండలి ఛైర్మన్‌గా పని చేసేందుకు రెండవసారి సీఎం కేసీఆర్‌ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని చెప్పారు. అందుకు కేసీఆర్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఛైర్మన్‌ పదవి ఏకగ్రీవానికి సహకరించిన అన్ని పార్టీల సభ్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. గతంలో మాదిరిగానే మండలిని హుందాగా నడిపేందుకు కృషి చేస్తానని తెలిపారు. సభా నిర్వహనలో న్యాయం చేస్తానని, ధర్మబద్ధంగా వ్యవహరిస్తాని ఆయన చెప్పారు. తాను ఏ స్థాయిలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రతి రాష్ట్రంలో అసెంబ్లీ, శాసనమండలి ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఉమ్మడి ఏపీలో అప్పటి సిఎం వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి శాసనమండలిని పునరుద్దరించగా, ప్రస్తుత సిఎం కేసీఆర్‌ బలోపేతం చేశారన్నారు. ఎమ్మెల్యే కోటా కింద మండలికి గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఎమ్మెల్సీగా రెండోసారి ఎన్నికయ్యారు. అంతకుముందు నల్గొండ పార్లమెంట్‌ నుంచి మూడుసార్లు ఎంపీగా పనిచేశారు. మండలి ఛైర్మన్‌ పదవి ఎన్నికకు సంబంధించి శనివారం షెడ్యూల్‌ విడుదలైన విషయం తెలిసిదే. ఈనెల 14న ఛైర్మన్‌ ఎన్నిక జరగనుంది. 2019, జూన్‌ నాల్గొవ తేదీ వరకు గుత్తా సుఖేందర్‌ రెడ్డి మండలి చైర్మన్‌గా పనిచేశారు. ప్రస్తుతం ప్రోటెం ఛైర్మన్‌గా ఎమ్మెల్సీ సయ్యద్‌ అమీనుల్‌ హసన్‌ జాఫ్రీ కొనసాగతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement