Wednesday, May 1, 2024

అమ‌ర్‌నాథ్ యాత్రికుల‌కు గుడ్ న్యూస్‌.. 30శాతం డిస్కౌంట్ ప్ర‌క‌టించిన‌ హోట‌ల్స్ అసోసియేష‌న్‌

అమర్ నాథ్ యాత్రలో పాల్గొనే భక్తులను ప్రోత్సహించేందుకు జమ్ముకశ్మీర్ లోని హోటల్స్ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ యాత్రలో పాల్గొనేవారు రూమ్స్ ను ముందస్తు బుకింగ్ చేసుకుంటే 30శాతం డిస్కౌంట్ అందించనున్నట్లు హోట‌ల్ నిర్వాహ‌కులు తెలిపారు. హిమాలయ పర్వత ప్రాంతంలో 3,880 మీటర్ల ఎత్తులో ఉండే అమర్ నాథ్ గుహ పుణ్యక్షేత్రాన్ని ఏడాదికోసారి దర్శించుకునేందుకు వచ్చే భక్తుల కోసమే తాము ఈ నిర్ణయం తీసుకన్నట్లు దక్షిణ కశ్మీర్ హోటల్స్ అసోసియేషన్ తెలిపింది.

ఉలై 1 నుంచి ప్రారంభం అవుతున్న ఈ యాత్ర 62 రోజుల పాట సాగనుంది. అనంత్ నాగ్ జిల్లా నున్వాన్-పహల్గాం రూట్లో 48కిలోమీటర్ల మార్గం, గందేర్బల్ జిల్లా బాల్టాల్ రూట్ లోని మార్గంలో భక్తులు దర్శనం కోసం నడిచివెళ్తారు. జూన్ 30న మొదటి భక్తుల బ్యాచ్ జమ్ము నుంచి బయల్దేర‌నున్న‌ట్టు తెలుస్తోంది. జమ్ములో బస చేసే భక్తులందరికీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా హోటళ్లు, లాడ్జీలలో 30 శాతం డిస్కౌంట్ ఇస్తామని ఆల్ జమ్ము హోటల్స్ అండ్ లాడ్జెస్ అసోసియేషన్ తెలిపింది.

- Advertisement -

ఈ యాత్రలో పాల్గొనే భక్తుల కోసం జమ్ములో 100కు పైగా హోటళ్లు అందుబాటులో ఉన్నాయి. భక్తులకు అసరమైన అన్ని సౌకర్యాలు వీటిలో ఉంటాయి. భగవతీ నగర్ బేస్ క్యాంప్ ఆవరణలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఈ ప్రాంతాన్ని భద్రతా దళాలు తమ అధీనంలోకి తీసుకున్నాయి. ప్రజల ఈ ప్రాంతంలోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించాయి. కాగా అమర్ నాథ్ యాత్రలో పాల్గొనేందుకు ఏటా లక్షల మంది భక్తులు దేశ నలుమూలల నుంచి కశ్మీర్ చేరుకుంటారు. వయసుతో సంబంధం లేకుండా అన్ని వ‌య‌స్సుల‌ వారు మంచు శివ లింగాన్ని దర్శించుకునేందుకు బారులు తీరుతుంటారు. దీంతో వీరికి ఎలాంటి లోటు పాట్లు లేకుండా అన్ని వసతులు కల్పించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేపడుతుంది.

యాత్ర ఇంకో రెండు వారాల్లో ప్రారంభం కానున్న తరుణంలో భక్తులు వెళ్లే మార్గంలో ఏర్పాట్లను సైన్యాధికారులు పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి అకౌకర్యం లేకుండా శిబిరాలు, టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అంచెలంచెల భద్రత చేపట్టారు. యాత్ర మార్గాన్ని డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. 2022లో యాత్ర సమయంలో క్లౌడ్ బరస్ట్ జరిగిన విషయాన్ని గ‌మ‌నంలోకి తీసుకుని అవసరమైతే తక్షణం సహాయక చర్యలు చేపట్టేలా ఏర్పాట్లు చేశారు. హెలికాప్టర్లు, ఆరోగ్య సేవల సదుపాయాలు కూడా కల్పిస్తున్నారు. భక్తులకు ఎక్కడా ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేశామని అధికారులు పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement