Saturday, March 2, 2024

TS | ‘గ్లోబరీనా’ గుబులు.. ఫలితాల కోసం ఎదురు చూస్తున్న టెన్త్‌, ఇంటర్‌ విద్యార్థులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఇంటర్‌ బోర్డుకు ‘గ్లోబరీనా’ గుబులు పట్టుకుంది. దాదాపు నాలుగేళ్ల క్రితం ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన పొరపాటు తాలూకు చేదు జ్ఞాపకాలు ఇంటర్‌ బోర్డుకు ఇంకా ఇప్పటి వరకూ వెంటాడుతూనే ఉన్నాయి. ఈనేపథ్యంలోనే ఇంటర్‌ ఫలితాలను ప్రకటించడంలో జాప్యం తరచుగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఫలితాలను ప్రకటించడంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఈ ఒక్క ఏడాదే కాదు గత ఏడాది కూడా దాదాపు ఇలానే జరిగింది. మొదటి నుంచి ఫలితాలు వెలువరించే తేదీపై స్పష్టతే లేదు. ఈవారం..వచ్చేవారం..10వ తేదీ లోపు అంటూ లీకులతోనే సరిపెట్టుకుంటున్నారు తప్పితే.. ఫలితాల ప్రకటనలో ముందస్తుగా ఒక స్పష్టమైన తేదీని బోర్డు అధికారులు ఎందుకు ప్రకటించలేకపోతున్నారనే చర్చ విద్యావర్గాల్లో జరుగుతోంది. ఫలితాల విడుదలపై స్పష్టత లేకపోవడంతో విషయంలో విద్యార్థుల్లో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది.

2019లో ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన సాంకేతిక తప్పిదాల కారణంగా కొంత మంది విద్యార్థులకు మార్కులు తక్కువగా వచ్చాయి. దాంట్లో కొంత మంది ఫెయిల్‌ కూడా అయ్యారు. ఈక్రమంలో విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. దాదాపు 20 మందికిపైగా ఇంటర్‌ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడంతో అప్పట్లో పెద్ద రాజకీయ దుమారమే లేచిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఘటన చెడ్డపేరు తీసుకురావడం, దీంతో నష్టనివారణ చర్యలు చేపడుతూ ఆ సంస్థపై వేటు వేయడం లాంటి చర్యలు చకచక జరిగాయి. అయతే ఆ ఘటన తాలూకు గుబులు ఇంటర్‌ బోర్డు ఫలితాలను వెలువరించడంలో అధికారులను ఇంకా ఇప్పటి వరకు వెంటాడుతునే ఉంది. అందుకే పరీక్షలు ముగిసి ఇన్ని రోజులవుతున్నా ఇంత వరకూ ఫలితాలను వెలువరించలేదు.

మార్చి 15న ఇంటర్‌ వార్షిక పరీక్షలు ప్రారంభమై ఏప్రిల్‌ 4న ముగిశాయి. ఏపీలోనూ ఇదే సమమాన ప్రారంభమై ముగిశాయి. అయితే ఏపీలో కేవలం 22 రోజులకే ఫలితాలను ప్రకటించినప్పటికీ మనదగ్గర మాత్రం ఫలితాలను వెలువరించడంపై అసలు స్పష్టతే లేదు. ఎప్పుడు విడుదలవుతాయో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఫలితాలనేవి దాదాపు 9.47 లక్షల మంది విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో గతంలో జరిగిన పొరపాటు మరోసారి జరగకుండా ఉండేలా ఇంటర్‌ బోర్డు అధికారులు ఎక్కువగా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే ఫలితాలు ప్రకటించడంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఒకటికి రెండు సార్లు క్రాస్‌ చెక్‌ చేసుకోవడం, ట్రయల్‌ రన్‌ వేయడం, మార్కులు అప్‌లోడ్‌, ఫలితాల విశ్లేషన చేస్తున్నారు. మరోవైపు అక్కడ ఏపీలో 22 రోజుల్లో ఎలాంటి పొరపాట్లు, తప్పిదాలు జరగకుండా ఫలితాలను విడుదల చేసినప్పుడు మన దగ్గర ఎందుకది సాధ్యపడటంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

ఏపీలో అలా… తెలంగాణలో ఇలా…

ఏపీలో 22 రోజులకే ఇంటర్‌ ఫలితాలు, 18 రోజులకే టెన్త్‌ ఫలితాలను ప్రకటించిన అధికారులు..తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇంత వరకూ ఏ ఫలితాలు విడుదల కాలేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, కాలేజీ యాజమాన్యాలందరూ ఇప్పుడు ఫలితాల కోసమే ఎదరు చూస్తున్న పరిస్థితి తలెత్తింది. ఇంటర్‌ విద్యార్థులు 9.47 లక్షల మంది, టెన్త్‌ విద్యార్థులు దాదాపు 4.84లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మొత్తం 14 లక్షల మందికిపైగా విద్యార్థులు ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు.

ఇంటర్‌ ఫలితాల తర్వాతే టెన్త్‌ ఫలితాలు!…

అసలు ఇంత వరకూ ఇంటర్‌ ఫలితాల తేదే ఫిక్స్‌ కాలేదు. టెన్త్‌ ఫలితాలు ఎప్పుడని అధికారులను అడిగితే ఇంటర్‌ ఫలితాల తర్వాత అంటున్నారు. ఇంటర్‌ ఫలితాలెప్పుడు అనే దానిపై స్పష్టత ముందు నుంచీ లేదు. మే మొదటి వారమని, రెండో వారమని.. 10 లోపు అని మీడియాకు బోర్డు వర్గాలు లీకులిచ్చాయి. ఈ క్రమంలోనే టెన్త్‌ ఫలితాలు కూడా ఈనెల 12న లేదా 17న ఉండే అవకాశం ఉందని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement