Tuesday, April 30, 2024

21న గగన్‌యాన్‌ ప్రయోగ పరీక్ష.. శ్రీహరికోటలో ప్రయోగం.

ప్రతిష్టాత్మక గగన్‌యాన్‌ మానవసహిత అంతరిక్ష నౌక మిషన్‌ కోసం మానవరహిత అంతరిక్ష ప్రయోగ పరీక్ష నౌకను (టీవీ-డీ1 టెస్ట్‌ ఫ్లయిట్‌) ఈ నెల 21వ తేదీ ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య కాలంలో శ్రీహరి కోటలోని సతీష్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగిస్తామని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సోమవారం ప్రకటించింది.

ఈ ప్రయోగం ద్వారా అంతరిక్ష నౌక నుంచి వ్యోమగాములు విడివడేందుకు ఉద్దేశించిన క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ పనితీరును పరీక్షిస్తారని ఇస్రో వర్గాలు తెలిపాయి. గగన్‌యాన్‌ ”టీవీ-డీ1 టెస్ట్‌ ఫ్లయిట్‌ ఒక సింగిల్‌ స్టేజ్‌ లిక్విడ్‌ రాకెట్‌. పేలోడ్లలో త్వరితగతిన చర్యకు ఉపక్రమించే సాలిడ్‌ మోటార్లు, సీఎం ఫెయిరింగ్‌(సీఎంఎఫ్‌), ఇంటర్‌ఫేస్‌ అడాప్టర్లతో కూడిన క్రూ మాడ్యూల్‌(సీఎం), క్రూ ఎస్కేప్‌ సిస్టమ్స్‌(సీయీఎస్‌) అందులో ఉంటాయి” అని వెల్లడించాయి.

- Advertisement -

మానవులను అంతరిక్షంలోకి తీసుకెళ్లడంలో భారత్‌ శక్తి సామర్థ్యాలను గగన్‌యాన్‌ ప్రాజెక్టు ప్రపంచానికి చాటి చెప్పనుంది. ప్రాజెక్టు ప్రకారం ఒకటి నుంచి మూడు రోజుల మిషన్‌లో భాగంగా భూమికి ఆవృతంగా దాదాపు 400 కి.మీ.ల వృత్తాకార కక్ష్యలోకి ఇద్దరు నుంచి ముగ్గురు సభ్యులను గగన్‌యాన్‌ తీసుకొనివెళుతుంది.

భారతీయ సముద్ర జలాల్లో నిర్దేశిత ప్రాంతంలోకి వారిని సురక్షితంగా తిరిగి తీసుకొని వస్తుంది. ”ఈ అంతరిక్ష నౌక ప్రయోగం సాధించే విజయం మిగిలిన ప్రయోగాలకు, మానవరహిత మిషన్లకు వేదికను సిద్ధం చేస్తుంది. భారతీయ వ్యోమగాములతో తొలి గగన్‌యాన్‌ మిషన్‌కు మార్గం సుగమం చేస్తుంది” అని ఇస్రో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement