Sunday, April 14, 2024

హైదరాబాద్‌లో జీ-20 సమావేశాలు.. వచ్చేనెల 6, 7 తేదీల్లో నిర్వహణకు భారీ ఏర్పాట్లు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : హైదరాబాద్‌ కేంద్రంగా వచ్చే నెల 6, 7 తేదీల్లో ప్రతిష్టాత్మకమైన జీ-20 సమావేశాలు జరుగనున్నాయి. ‘గ్లోబల్‌ పార్ట్నర్‌షిప్‌ ఫర్‌ ఫైనాన్సియల్‌ ఇన్‌క్లూజన్‌’ పేరుతో ఈ సదస్సు జరుగనుంది. సదస్సుకు అన్ని జీ-20 దేశాలు, ఆహ్వానిత దేశాల ప్రతినిధులతో పాటు ఇతర అంతర్జాతీయ ప్రతినిధులు కూడా హాజరు కానున్నారు. జీ-20 సదస్సులో భాగంగా పలు వాణిజ్య సదస్సులు సైతం జరుగనున్నాయని విదేశాంగశాఖ అధికారి ముక్తేశ్‌ పరదేశి తెలిపారు. అలాగే మార్చి 28, 29 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం కేంద్రంగా ఈ సమావేశాలు జరుగనున్నాయి. హైదరాబాద్‌ ప్రతిష్టను మరింతగా పెంచే జీ-20 కార్యవర్గ సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని కోనాల్లో భారీ ఏర్పాట్లు చేస్తోంది.

ఈ ఏర్పాట్లకు సంబంధించి భద్రతా సమన్వయ కమిటీ సమావేశం ఇటీవల డీజీపీ అంజనీకుమార్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర సీనియర్‌ పోలీసు అధికారులు, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, ప్రాంతీయ పాస్‌పోర్ట్‌ కార్యాలయం, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌ఆర్‌డీఎఫ్‌, సీఐఎస్‌ఎఫ్‌, ఎన్‌ఎస్‌జీ ఇతర భద్రతా సంబంధిత విభాగాల అధికారులు హాజరయ్యారు. ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల మందిని కవర్‌ చేయడంతో పాటు, ప్రపంచ జీడీపీలో 85శాతం, 75శాతం వాటా కలిగిన 29 దేశాలు జీ-20లో సభ్యులుగా ఉన్నాయి. జీ-20 దేశాల అధినేతల సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్‌లో ఉండనుంది. ప్రపంచ వాణిజ్యం, ప్రధానమంత్రి నేతృత్వంలో సెప్టెంబర్‌లో ఉంటుంది.

కాగా, ఈ సదస్సుకు ముందు దేశంలోని 56 నగరాల్లో 215 కార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఆరు జీ-20 సమావేశాలు జరగనున్నాయి. మొదటి సమావేశం జనవరి 28న పూర్తయింది. మార్చి 6, 7తో పాటు ఏప్రిల్‌ 26, 27,28, జూన్‌ 7, 8, 9, 15, 16, 17లలో వివిధ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలకు మంత్రులు, కార్యదర్శులు, ఇతర ఉన్నతస్థాయి స్థాయి అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరవుతారు.

జీ-20 సమావేశాలకు హాజరయ్యే ఉన్నత స్థాయి ప్రతినిధులు హైదరాబాద్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించే అవకాశం ఉన్నందున.. ఆయా ప్రాంతాల్లో విస్తృత భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఈ విషయంలో సమర్థవంతమైన సమన్వయం కోసం అంతర్గత వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని డీజీపీ ఆదేశించారు. ప్రధానంగా విమానాశ్రయం, ప్రతినిధులు బస చేసే హోటళ్లు, సమావేశ ప్రాంతాల్లో విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్లను భద్రతా కమిటీలో సభ్యులగా ఉన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement