Thursday, April 18, 2024

ఇజ్రాయెల్‌లో ఫ్లోరోనా.. కొవిడ్‌-19, ఇన్‌ఫ్లూయెంజా డబుల్‌ ఇన్‌ఫెక్షన్‌గా నిర్థారణ..

కరోనా మహమ్మారిపై పోరాటం ముగియక ముందే ఇజ్రాయెల్‌లో ఫ్లోరోనా అనే మరొక వైరస్‌ వెలుగులోకి వచ్చింది. ఆ దేశంలో ఫ్లోరోనా మొదటి కేసు నమోదైంది. ఇది కొవిడ్‌-19, ఇన్‌ఫ్లూఎంజా డబుల్‌ ఇన్‌ఫెక్షన్‌ అని అరబ్‌ న్యూస్‌ తెలిపింది. ఒమి క్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రభుత్వం తమ పౌరులకు నాల్గవ విడత కొవిడ్‌ టీకాల పంపిణీ చేపట్టింది. టీకాల ప్రాధాన్యత క్రమంలో బలహీన రోగనిరోధక శక్తి కలిగిన వారికి బూస్టర్‌ డోస్‌ ఇస్తున్నామని ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ జనరల్‌ నాచ్‌మన్‌ యాష్‌ తెలిపారు. మూడవ మోతాదు తర్వాత కనీసంగా నాలుగు నెలల విరామం తర్వాత మరొక బూస్టర్‌కు ఆమోదం తెలిపామని అన్నారు. తాజా డేటా ప్రకారం గురువారం ఒక్కరోజే దాదాపు 5000 కొత్త కేసులు నిర్థారణ అయ్యాయి.

ఫ్లోరోనా అత్యంత ప్రమాదమా?
కొవిడ్‌-19, ఫ్లూకి కారణమయ్యే వైరస్‌లు రెండూ ఒకే విధంగా వ్యాపిస్తాయి. సన్నిహిత సంబంధం ఉన్న వ్యక్తుల మధ్య వ్యాప్తి చెందుతాయి. శ్వాసకోస బిందువుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి చేరుతాయి. రెండు వైరస్‌లు ఒకే శరీరంలోకి ప్రవేశిస్తే వినాశనం కలిగిస్తాయని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. ఇది ఇతర వ్యాధులకు కూడా దారితీస్తుంది. అవి న్యుమోనియా, అక్యూట్‌ రెస్పిరేటరీ డిస్ట్రెస్‌ సిండ్రోమ్‌, అవయవ వైఫల్యం, గుండెపోటు, గుండె లేదా మెదడు వాపు బారినపడేందుకు కారణమవుతాయి. కొన్నిసార్లు ప్రాణాంతకంగా కూడా అవుతాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌ఒ) ప్రకారం, రెండు వ్యాధులను ఒకేసారి గుర్తించడం సాధ్యమే. తీవ్రమైన కొవిడ్‌-19, ఇన్‌ఫ్లూ ఎంజాను నివారించడానికి రెండు రకాల టీకాలు వేయడమే అత్యంత ప్రభావ‌వంతమైన మార్గం అని డబ్ల్యుహెచ్‌ఒ వెబ్‌సైట్‌ తెలియజేస్తున్నది.

వ్యాధి నిర్దారణ.. నివారణ..
ఫ్లూ వైరస్‌ లక్షణాలు మూడు లేదా నాలుగు రోజుల్లో బయటపడతాయి. కానీ కరోనా వైరస్‌ లక్షణాలు కనిపించడానికి 14 రోజులు పడుతుంది. దగ్గు, జలుపు, జ్వరం, ముక్కు కారడం వంటి లక్షణాలు రెండింటి లోనూ ఉన్నాయి. రెండు వైరస్‌ల నిర్ధారణ కోసం పీసీఆర్‌ పరీక్షలు చేస్తారు. అయితే రెండింటికీ వేర్వేరు పీసీఆర్‌లు ఉంటాయి. వైరస్‌ల జన్యురూపాలు భిన్నంగా ఉండటమే ఇందుకు కారణం. ఫ్లూ, కరోనా రెండు టీకాలను వేయడమే ఫ్లోరోనా నివారణకు మార్గమని నిపుణులు పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement