Friday, May 17, 2024

కేంద్రంపై టీఆర్‌ఎస్ ఎంపీల ధ్వజం.. రెండో వారమూ కొనసాగిన ఆందోళన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ప్రజాస్వామ్య పాలనలో భాగంగానే టీఆర్ఎస్ ప్రజా సమస్యలపై పార్లమెంట్ సాక్షిగా అధికార పక్షాన్ని నిలదీస్తోందని ఆ పార్టీ లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు మండిపడ్డారు. శుక్రవారం పార్లమెంట్ ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద టీఆర్‌ఎస్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు విపక్ష ఎంపీలతో కలిసి ధర్నా నిర్వహించారు. పెంచిన నిత్యావసర వస్తువుల ధరలు, జీఎస్టీని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలపై మోపిన భారానికి ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందేమోనన్న భయంతోనే కేంద్రం చర్చకు అనుమతించకుండా తప్పించుకుంటోందని నామా ధ్వజమెత్తారు.

సహేతుకమైన కారణాలు లేకుండా కేవలం నిరసన తెలియజేశారన్న అక్కనుతో ఎంపీలను సస్పెండ్ చేయడం అసాధరణ పరిణామమని ఆయన పేర్కొన్నారు. ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కి కేంద్రం నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. శుక్రవారం టీఆర్ఎస్, విపక్ష ఎంపీలు ప్లకార్డులతో నిరసన తెలపడంతో ఉభయ సభలను సోమవారానికి వాయిదా వేశారు. ఈ ఆందోళనల్లో టీఆర్‌ఎస్ ఎంపీలు జోగినపల్లి సంతోష్ కుమార్ , కె.ఆర్. సురేష్ రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, వద్ధిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదరరావు, బండి పార్ధసారథిరెడ్డి , మన్నె శ్రీనివాసరెడ్డి , గడ్డం రంజిత్ రెడ్డి, మాలోత్ కవిత, బొర్లకుంట వెంకటేశ్ నేత, పోతుగంటి రాములు, పసునూరి దయాకర్ తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement