Wednesday, May 1, 2024

తొలి ప్రతిష్ట… కొత్త సచివాలయానికి గోల్డ్‌ రేటింగ్‌

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : అద్భుతమైన కట్టడంగా రూపుదిద్దుకున్న డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ కొత్త సచివాలయం.. ప్రతిష్ట మరింత పెరిగేలా ఒండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) గోల్డ్‌ రేటింగ్‌కు ఎంపికైంది. దేశంలో ఈ రేటింగ్‌ లభించిన తొలి సచివాలయంగా తెలంగాణ ఘనతకెక్కడం మరో విశేషం. తాజాగా సెక్రటేరియెట్‌ గోల్డ్‌ రేటింగ్‌కు ఎంపిక కావడంతో సీఎం కేసీఆర్‌ ముందుచూపు ఆలోచనపై హర్షద్వానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన భవనాల్లో రెండింటికి ఈ రేటింగ్‌ లభించింది. ఈ మేరకు హరిత భవన మండలి హైదరాబాద్‌ చాప్టర్‌ ఛైర్మన్‌ సి.శేఖర్‌రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు.

కొత్త సచివాలయం గోల్డ్‌ రేటింగ్‌కు ఎంపికైందని.. ఆ రేటింగ్‌ ప్రమాణాలను పాటించిన సచివాలయం దేశంలో మరొకటి లేదని సి.శేఖర్‌రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా తెలంగాణ కొత్త సచివాలయాన్ని హరిత భవన మండలి (ఐజీబీసీ-ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌) ప్రమాణాల మేరకు నిర్మించారని స్పష్టం చేశారు. కొత్త సెక్రటేరియెట్‌లో 100 శాతం ఎల్‌ఈడీ వ్యవస్థను ఏర్పాటు చేశారు. విద్యుత్‌ వినియోగాన్ని పర్యవేక్షించేందుకు బీఎంఎస్‌ (భవన నిర్వహణ వ్యవస్థ)ను కూడా ఏర్పాటు చేశారు. భవన ప్రాంగణంలో పచ్చదనం కోసం స్థానిక మొక్కలను (దేశవాలీ) తీసుకున్నారు.

- Advertisement -

సెంట్రల్‌ కోర్డు యార్డు నమూనాను వినియోగించారు. భవనాలను హరిత ప్రమాణాలతో నిర్మిస్తే.. అందులో పనిచేసే వారి ఉత్పాదకత పెరుగుతుందన్నది సీఎం కేసీఆర్‌ మదిలోని ఆలోచన. కొత్త సచివాలయ నిర్మాణంలో పాటించిన ప్రమాణాలతో నీరు, విద్యుత్‌ వినియోగంలో 30 నుంచి 40 శాతం వరకు ఆదా అవుతుందని అధికారులు వెల్లడించారు.

ఐజీబీసీ గోల్డ్‌ రేటింగ్‌ ఇచ్చే విధానం..

భవనాల నిర్మాణంలో హరిత ప్రమాణాలను పాటించినట్లు ఆయా సంస్థలు ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌కు దరఖాస్తు చేసుకుంటాయి. అవి అలా ప్రమాణాలను పాటించాయో లేదో గుర్తించేందుకు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన నిపుణులతో కౌన్సిల్‌ ఉంటు-ంది. ఆ నిపుణుల బృందం నిర్మాణాన్ని పరిశీలిస్తుంది. నిర్మాణ తీరు తెన్నులు తెలుసుకుంటుంది. ఐజీబీసీ ప్రమాణాల మేరకు నిర్మాణం జరిగినట్లు తేలితే అప్పుడు గోల్డ్‌ రేటింగ్‌ ఇస్తుంది.

గోల్డ్‌ రేటింగ్‌ కోసం అర్హతలు

భవనాలకు గోల్డ్‌ రేటింగ్‌ దక్కాలంటే నిర్మాణంలో కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటు-ంది. ముఖ్యంగా ఆ భవనంలోకి సహజ సిద్ధమైన గాలి, వెలుతురు పుష్కలంగా వచ్చేలా ఉండాలి. నీటి వృథాను నియంత్రించేందుకు సెన్సర్స్‌, ఆటోమేటిక్‌ విద్యుత్‌ పరికరాలు ఉపయోగించాలి. ఇవన్నీ చేస్తే.. పాటించిన నిబంధనల ప్రకారం ప్లాటినం, గోల్డ్‌, సిల్వర్‌, సర్టిఫికెట్‌.. ఇలా గుర్తింపు లభిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement