Sunday, May 5, 2024

బియ్యం సేకరణ ఆపేసిన ఎఫ్​సీఐ.. డేంజర్​లో రైసు మిల్లు పరిశ్రమ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో రేషన్‌ బియ్యం పంపిణీ సరిగ్గా కావడం లేదని, భౌతిక తనిఖీల సమయంలో రైసు మిల్లుల్లో ధాన్యం నిల్వల లెక్కలు సరిపోలేదని తదితర కారణాలతో బియ్యం సేకరణను ఎఫ్‌సీఐ/కేంద్ర ప్రభుత్వం నిలిపివేయడంతో రైసు మిల్లులకు తాళాలు పడుతున్నాయి. సన్నధాన్యానికి సంబంధించి ఇబ్బంది లేకపోగా, దొడ్డు ధాన్యం మిల్లింగ్‌ చేసేచోట సమస్యలు తలెత్తుతున్నాయి. ఫలితంగా ఈ యాసంగిలో రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్‌ మెట్రిక్‌ టన్నులు కలిపి మొత్తం 94లక్షట మెట్రిక్‌ టన్నుల ధాన్యం మిల్లుల్లో మూలుగుతోంది. ఎఫ్‌సీఐ బియ్యం సేకరణను ఈ నెల 7 నుంచి నిలిపివేయడంతో 20 రోజులుగా కస్టమ్‌ మిల్లింగ్‌ నిలిచిపోయింది. బియ్యం సేకరణకు ఎఫ్‌సీఐ అనుమతించకపోవడంతో మిల్లింగ్‌ ప్రక్రియ నిలిచిపోయి మిల్లర్లు, కార్మికులు, మిల్లులపై ఆధారపడిన తౌడు, నూక వ్యాపారులు, సాల్వెంట్‌ ఆయిల్‌మిల్‌ పరిశ్రమ కూడా కుదేలవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3200 రైసు మిల్లింగ్‌ నిలిచిపోవడంతో ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న రైసు మిల్లుల యజమానులతోపాటు కూలీలు, లారీ డ్రైవర్లు, గుమస్తాలు,హమాలీల జీవనోపాధి కూడా తీవ్రంగా దెబ్బతింటోంది. ఎంత లేదన్నా ప్రతిరైసు మిల్లులో కనీసం 50 మంది హమాలీలు, ఒకరిద్దరు డ్రైవర్లు, మరో ఇద్దరు గుమస్తాలు పనిచేస్తుంటారు. దీనికి తోడు దొడ్డు ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయగా వచ్చిన తౌడు, నూకను విక్రయించి జీవించే చిన్న చితకా వ్యాపారుల జీవనోపాధి గడవడం కష్టంగా మారింది. దొడ్డు ధాన్యం మిల్లింగ్‌ తర్వాత వచ్చే తౌడుతో ఉత్పత్తి అయ్యే రైస్‌ బ్రౌన్‌ ఆయిల్‌ పరిశ్రమ పై ఆధారపడిన వారు కూడా ఉపాధి కోల్పోతున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల నుంచి తరలించిన ధాన్యం రైసు మిల్లుల్లో నిల్వ చేశారు.

మిల్లింగ్‌ ప్రక్రియ అవుతుందనుకుని బహిరంగ ప్రదేశాల్లోనే ధాన్యం బస్తాలను మిల్లర్లు నిల్వ చేశారు. ప్రస్తుతం ఎఫ్‌సీఐ /కేంద్ర ప్రభుత్వం కొర్రీల కారణంగా మిల్లింగ్‌ నిలిచిపోవడంతో ధాన్యం ఎండకు ఎండుతూ, వానకు తడుస్తోంది. వర్షాలకు ధాన్యం మొలకొస్తోంది. కస్టమ్‌ మిల్లింగ్‌ నిబంధనల ప్రకారం ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రభుత్వం నిర్దేశించిన సమయంలో ఎఫ్‌సీఐకి అప్పగించే బాధ్యత మిల్లర్లదే. ఈ క్రమంలో ఎక్కడ ధాన్యం నాణ్యత దెబ్బతిన్నా ఆ నష్టాన్ని మిల్లర్లే భరించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఒక్కో మిల్లుల్లో కోట్లాదిరూపాయల ధాన్యం నిల్వ ఉన్నందున నష్టం కోట్లలోనే ఉంటుందని రైసు మిల్లర్లు వాపోతున్నారు. మిల్లింగ్‌ నిలిచిపోవడంతో బీహార్‌, ఒడిశా, ఇతర రాష్ట్రాల నుంచి లక్షలకు లక్షలు అడ్వాన్స్‌ లు చెల్లించి తీసుకువచ్చిన కూలీలు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతామంటుండడంతో మిల్లు యజమానులకు ఏం చేయాలో తోచడం లేదు. మరోవైపు మిల్లులపై కరెంటు బిల్లుల భారం మూలిగే నక్కమీద తాటిపండు పడ్డ చందంగా మారింది. మిల్లింగ్‌ ప్రక్రియ నిలిచిపోవడంతో కరెంటు కాల్చినా కాల్చకపోయినా చిన్న మిల్లు అయితే రూ.1లక్ష, పెద్ద మిల్లు అయితే రూ.4లక్షలను మినిమ్‌ కరెంటు బిల్లు కింద ప్రతి నెలా చెల్లించాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికైనా పునరాలోచించుకొని బియ్యం సేకరణను ప్రారంభించాలని కేంద్ర ప్ర భుత్వాన్ని, ఎఫ్‌సీఐని మిల్లర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement