Friday, May 3, 2024

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌కు సర్వం సిద్ధం, కలెక్టర్లకు కీలక బాధ్యతలు.. ఆదేశాలిచ్చిన సీఎస్‌ సోమేష్‌కుమార్

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: 1019 కేంద్రాల్లో 3.8 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమ్స్‌ పరీక్షలకు హాజరవుతున్నారని, గ్రూప్‌-1 పరీక్ష సజావుగా నిర్వహించేందుకు సకల జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్‌ సోమేస్‌కుమార్‌ అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ డా.బి.జనార్దన్‌రెడ్డి, డీజీపీ మహెందర్‌రెడ్డిలు జిల్లా కలెక్టర్లు, పోలీస్‌ కమిషనర్లు, ఎస్పీలతో గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై మంగళవారంనాడు బీఆర్కే భవన్‌ నుంచి టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహంచారు. ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 16న జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1019 కేంద్రాల్లో 3.8 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమ్స్‌ పరీక్షలకు హాజరవుతున్నారని, పరీక్ష సజావుగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. స్ట్రాంగ్‌ రూమ్‌లను గుర్తించి, పోలీసు శాఖ సమన్వయంతో తగిన పోలీసు రక్షణ ఏర్పాటు, జిల్లా కలెక్టర్లు సంబంధిత శాఖ అధికారులతో సమావేశం నిర్వహించాలని, పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, పారిశుధ్యం తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. స్ట్రాంగ్‌ రూమ్‌ ఇంచార్జ్‌లు, రూట్‌ ఆఫీసర్లు, లైజన్‌ ఆఫీసర్లు, అసిస్టెంట్‌ లైజన్‌ ఆఫీసర్లు, చీఫ్‌ సూపరింటెండెంట్లు టీఎస్‌పీఎస్సీ ఇచ్చిన చెక్‌ లిస్ట్‌ ప్రకారం సూచనలను పాటించాలన్నారు. టీఎస్‌పీఎస్‌సీ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్‌ రూం కూడా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రాలలో 16న ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1.00 గంటల వరకు జరగాల్సిన ప్రిలిమినరీ టెస్ట్‌ (ఆబ్జెక్టివ్‌ టైప్‌) కోసం అభ్యర్థులు వారి హాల్‌ టిక్కెట్‌లను టీఎస్‌పీఎస్‌సీ కమిషన్‌ వెబ్‌సైట్‌ TSPSC.gov.in ద్వారా డౌన్‌ లోడ్‌ చేసుకోవాలని సూచించారు.

పరీక్షల కోసం తొలిసారిగా ప్రవేశపెట్టిన బయోమెట్రిక్‌ ఫీచర్‌పై అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అభ్యర్థులు కూడా హాల్‌ టిక్కెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని, చివరి నిమిషంలో ఆలస్యం జరగకుండా ఉండేందుకు నిర్ణీత సమయానికి ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని అభ్యర్ధులకు తెలిసేలా ప్రచారం చేయాలన్నారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌, జీఏడీ సెక్రటరీ శేషాద్రి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement