Friday, May 10, 2024

Maharashtra – ఆదిత్య ఠాక్రే, సంజయ్‌ రౌత్‌ సన్నిహితుల ఇళ్లలో ఈడీ సోదాలు..

ముంబై – కొవిడ్‌ సమయంలో ఫీల్డ్‌ ఆస్పత్రుల కేటాయింపులో జరిగిన అవకతవకల పై దర్యాప్తులో భాగంగా ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) అధికారులు ముంబయిలోని ప‌లువురి ఇళ్ల‌లోనూ, కార్యాల‌యాల‌లోనూ దాడులు నిర్వహించారు. వాటిల్లో ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ జైస్వాల్‌ ఇల్లు, శివసేన యూబీటీ వర్గం నేత ఆదిత్య ఠాక్రే కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న సూరజ్‌ చవాన్‌ గృహం కూడా ఉన్నాయి. దీంతోపాటు మరోనేత సంజయ్‌రౌత్‌ మిత్రుడు సుజిత్‌ పాట్‌కర్‌ ఇంట్లో కూడా ఈడీ తనిఖీలు చేస్తోంది. కొవిడ్‌ ఫీల్డ్‌ ఆస్పత్రి కుంభకోణంలో మనీలాండరింగ్‌ జరిగిందనే అనుమానంతో ఈ గాలింపు జరుగుతోంది.
గతంలో జైస్వాల్‌ థానే కమిషనర్‌గా విధులు నిర్వహించారు.

దీంతోపాటు కొవిడ్‌ సమయంలో ముంబయి డిప్యూటీ కమిషనర్‌ పదవిలో కూడా పనిచేశారు. ఈ కేసుకు సంబంధించి జనవరిలో బీఎంసీ కమిషనర్‌ ఇక్బాల్‌ సింగ్‌ చాహల్‌ వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేశారు. ఇక సుజిత్‌ పాట్‌కర్‌పై గతంలోనే ఈడీ మనీలాండరింగ్‌ అభియోగాలను నమోదు చేసింది. హెల్త్‌కేర్‌ రంగంలో ఎటువంటి అనుభవం లేకపోయినా కొవిడ్‌ సమయంలో అతడికే ఫీల్డ్‌ ఆస్పత్రి కాంట్రాక్టు దక్కింది. దీనిపై గతేడాది భాజపా నేత కీర్తి సొమయ్య ఆజాద్‌ మైదాన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. దీని ఆధారంగా లైఫ్‌లైన్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌, పాట్‌కర్‌, అతడి ముగ్గురు సన్నిహితులపై కేసులు నమోదు చేశారు. తప్పుడు విధానంలో వీరు ఫీల్డ్‌ ఆస్పత్రుల కాంట్రాక్టులు దక్కించుకొన్నారన్నవి అభియోగాలు. దీనిపై ఈడి దర్యాప్తు జ‌రుపుతున్న‌ది..

Advertisement

తాజా వార్తలు

Advertisement