Wednesday, May 15, 2024

New Records | ఈఎపి సెట్‌ ర్యాంకుల్లో అబ్బాయిలదే హవా.. జులై 15 నుంచి కౌన్సిలింగ్‌

అమరావతి, ఆంధ్రప్రభ : ఏపీ ఈఏపీసెట్‌ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం విజయవాడలో విడుదల చేశారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 1,71,514 మంది (76.32 శాతం), అగ్రికల్చర్‌లో 81,203 మంది (89.65 శాతం) ప్రవేశాలకు అర్హత సాధించారు. కాగా ఇంజనీరింగ్‌ విభాగంలో టాప్‌టెన్‌ ర్యాంకుల్లో ఒక్క అమ్మాయి కూడా లేదు. మరోవైపు అగ్రికల్చర్‌ విభాగంలోనూ ఇద్దరు అమ్మాయిలు మాత్రమే టాప్‌ టెన్‌లో ఉండగా మిగిలిన ఎనిమిది ర్యాంకులు అబ్బాయిలు సాధించారు.

అయితే మొత్తంగా ఉత్తీర్ణతా శాతం చూస్తే అబ్బాయిల కంటే అమ్మాయిలే 3.99 శాతం అదనంగా ఉత్తీర్ణులయ్యారు. కాగా ఇంజినీరింగ్‌ విభాగంలో ఉమేశ్‌ వరుణ్‌ (నందిగామ) మొదటి స్థానంలో నిలవగా అభినవ్‌ చౌదరి (హైదరాబాద్‌) రెండో స్థానంలో, సాయిదుర్గారెడ్డి (పిడుగురాళ్ల) మూడో ర్యాంకు, బాబు సుజన్‌రెడ్డి (తిరుపతి) నాలుగో ర్యాంకు, వెంకట యుగేశ్‌ (రాజంపేట) ఐదో స్థానం దక్కించుకున్నారు.

అగ్రికల్చర్‌ విభాగంలో సత్యరాజ జశ్వంత్‌ (కాతేరు) మొదటి ర్యాంకు సాధించగా వరుణ్‌ చక్రవర్తి (శ్రీకాకుళం) రెండో ర్యాంకు, రాజ్‌కుమార్‌ (సికింద్రాబాద్‌) మూడో ర్యాంకు, సాయి అభినవ్‌ (చిత్తూరు) నాలుగో ర్యాంకు, కార్తికేయరెడ్డి (తెనాలి)కి ఐదో ర్యాంకు వచ్చాయి. కాగా ఈఎపిసెట్‌లో వచ్చిన మార్కులతోపాటు ఇంటర్‌లో వచ్చిన మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులు నిర్ణయించినట్లు చెప్పారు.

- Advertisement -

ఈఏపీ సెట్‌ నిర్వహించిన జేఎన్‌టీయూ అనంతపురం అధికారులను మంత్రి బొత్స అభినందించారు. మార్చి 10న నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు చెప్పారు. ఈఏపీ సెట్‌ పరీక్షలకు ఈ ఏడాది 3,38,739మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇంజనీరింగ్‌ పరీక్షలకు 2.38 లక్షల మంది, అగ్రికల్చర్‌ విభాగంలో 1,00,559 మంది దరఖాస్తు చేశారని చెప్పారు.

ఇంజనీరింగ్‌, ఫార్మా విభాగంలో 2,38,180మంది దరఖాస్తు చేసుకుంటే 2,24,724మంది పరీక్షలకు హాజరయ్యారని వారిలో 1,71,514మంది అర్హత సాధించినట్లు చెప్పారు. మొత్తం హాజరైన వారిలో 76.32శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. అగ్రికల్చర్‌ విభాగంలో 1,00,559మంది దరఖాస్తు చేస్తే 90,573మంది పరీక్షలకు హాజరయ్యారని వారిలో 81203మంది అర్హత సాధించినట్లు చెప్పారు.

అగ్రి విభాగంలో 89.65శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి బొత్స వివరించారు. కాగా ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ,నర్సింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికిగాను ఈ ర్యాంకుల ఆధారంగా జులై 15వ తేదీ నుంచి కౌన్సిలింగ్‌ నిర్వహించి అగస్టు 15వ తేదీ నాటికి అడ్మిషన్ల ప్రక్రియ నంతా పూర్తి చేస్తామని చెప్పారు. ఇంజనీరింగ్‌ కాలేజీల్లో క్వాలిటీని పెంచేందుకు ఈ ఏడాది నుండి నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ హేమచంద్రారెడ్డి తెలిపారు.

కాగా నాణ్యతా ప్రమాణాలు పాటించని కాలేజీలను తాము బ్లాక్‌లిస్ట్‌లో పెట్టగా వారు కోర్టుకెళ్లి అనుమతులు తెచ్చుకున్నారని చెప్పారు. దీనిపై మంత్రి బొత్స కలుగజేసుకొని ఈ ఏడాది మీరే ముందుగా కోర్టులో అఫడవిట్‌ వేసి వారు కోర్టకు వెళ్లకుండా అడ్డుకోవాలని సూచించారు.

ఇంజనీరింగ్‌ విభాగంలో టాప్‌ టెన్‌ ర్యాంకులు

  1. చల్లా ఉమేష్‌ వరుణ్‌…..నందిగామ(ఎన్‌టిఆర్‌ జిల్లా)
  2. బిక్కిన అభినవ్‌ చౌదరి….మాదాపూర్‌(హైదరాబాద్‌)
  3. నందిపాటి సాయిదుర్గారెడ్డి….కొనంకి(పల్నాడు జిల్లా)
  4. చింతపర్తి బాబు సుజన్‌రెడ్డి …తిరుపతి
  5. దుగ్గినేని వెంకట యుగేష్‌… రాజంపేట(అన్నమయ్య జిల్లా)
  6. అడ్డగడ వెంకట శివరామ్‌…. చిలుకలూరిపేట(పల్నాడు జిల్లా)
  7. యెక్కంటి ఫణి వెంకట మణిందర్‌రెడ్డి…గుంటూరు
  8. ఎం.ఎల్‌ మాధవ్‌ భరద్వాజ్‌….అనంతపూర్‌
  9. పిన్ను శశాంక్‌ రెడ్డి …..తిరుపతి
  10. ఎం.శ్రీకాంత్‌…మాదాపూర్‌ (హైదరాబాద్‌)
    అగ్రికల్చర్‌ విభాగంలో టాప్‌టెన్‌ ర్యాంకులు
  11. బి. సత్యరాజ్‌ జస్వంత్‌….కాతేరు(తూర్పుగోదావరి జిల్లా)
  12. బొరా వరుణ్‌ చక్రవర్తి…తోతాడ(శ్రీకాకుళం జిల్లా)
  13. కొన్ని రాజ్‌కుమార్‌… మౌలాలి(సికింద్రాబాద్‌)
  14. వలేజీ సాయి మాధవ్‌…చిత్తూరు
  15. డి.కార్తికేయరెడ్డి …తెనాలి(గుంటూరు జిల్లా)
    6.కె.రాజేశ్వరి….హిమాయత్‌ నగర్‌(హైదరాబాద్‌)
  16. టి.ఎస్‌.వి. యశ్వంత్‌ నాయుడు…మోదలవలస(శ్రీకాకుళం జిల్లా)
  17. గుడిపూడి కీర్తి …..కొంగపాడు(ప్రకాశం జిల్లా)
  18. పి. అశిష్‌….శ్రీకాకుళం
  19. డి.అభిజిత్‌ సాయి…కె.రామాపురం(అన్నమయ్య జిల్లా)

Advertisement

తాజా వార్తలు

Advertisement