Tuesday, June 18, 2024

తెలంగాణ ప్రజలకు యునెస్కో వారసత్వ కేంద్రం డైరక్టర్ తెలుగులో శుభాకాంక్షలు..

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లాలో ఉన్న కాకతీయ రుద్రేశ్వర ఆలయం యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు పొందడం పట్ల తెలంగాణ ప్రజలకు, భారతీయులకు యునెస్కో వారసత్వ కేంద్రం డైరెక్టర్ లాజర్ ఎలౌండౌ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఈ శుభాకాంక్షల సందేశాన్ని తెలుగులో పంపడం విశేషం. ‘ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో రుద్రేశ్వర రామప్ప ఆలయం చోటు దక్కించుకున్నందుకు భారతదేశ ప్రజలకు అభినందనలు’ అని లాజర్ ఎలౌండౌ వీడియో సందేశంలో పేర్కొన్నారు.

భారతదేశ వారసత్వానికి, సంస్కృతి, సంప్రదాయాలకు దక్కిన ఈ గుర్తింపును ప్రస్తావిస్తూ, భారతీయ ప్రజలను అభినందిస్తూ.. తెలుగు భాషలో లాజర్ ఎలౌండౌ వీడియో సందేశాన్ని విడుదల చేయడంపై కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మనస్ఫూర్తిగా స్వాగతించారు. ‘చక్కగా తెలుగులో మాట్లాడి, అభినందించిన ఎలౌండౌ గారికి భారతదేశ ప్రజల తరఫున, మరీ ప్రత్యేకంగా తెలంగాణ ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదములు’ అని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు. అద్భుత శిల్పకళా సంపదకు కొలువైన ఈ కాకతీయుల నాటి ఆలయానికి (క్రీ.శ 1213లో గణపతి దేవుడి కాలంలో నిర్మాణం) వారసత్వ సంపదగా గుర్తింపు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా 42 కట్టడాలను గుర్తింపు లభించగా ఇందులో మన దేశం నుంచి రామప్ప ఆలయానికి మాత్రమే అవకాశం దొరికిన సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement