Friday, May 3, 2024

భారీగా పెరుగుతున్న లిథియం అయాన్‌ బ్యాటరీల డిమాండ్‌

ప్రపంచ వ్యాప్తంగా లిథియం అయాన్‌ బ్యాటరీల డిమాండ్‌ భారీగా పెరుగుతోంది. స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, వైద్య పరికరాలు, ఎలక్ట్రిక్‌ వాహనాల వరకు ఈ బ్యాటరీలు అవసరం అవుతున్నాయి. ఈ బ్యాటరీలు పోర్టబుల్‌ విద్యుత్‌ను అందిస్తున్నాయి.
వైట్‌గోల్డ్‌ గా పిలవబడే లిథియం వృధువైన వెండి-తెలుపు క్షార లోహం. ఇది రియాక్టివ్‌, చాలా తేలిగ్గా, తక్కువ సాంద్రత కలిగి ఉంటుంది. రీఛార్జ్‌ చేసుకునేందుకు వెలుసులుబాటు కారణంగా ఈ బ్యాటరీలు కీలకంగా మారాయి. గ్లోబల్‌ మార్కెట్‌లో లిథియం ఆయాన్‌ బ్యాటరీ మార్కెట్‌ విలువ 2021లో 6.83 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2022 నుంచి 2030 వరకు ఈ బ్యాటరీల మార్కెట్‌ వృద్ధి వార్షికంగా 12 శాతం వరకు ఉంటుందని అంచనా వేశారు.

ప్రధానంగా విద్యుత్‌ వాహనాల సంఖ్య పెరుగుతుంటే లిథియం అయాన్‌ బ్యాటరీల డిమాండ్‌ అంతే స్థాయిలో పెరగనుంది. ప్రధానంగా ప్రభుత్వాలు ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఇస్తున్న సబ్సిడీలు, ప్రోత్సహకాల మూలంగా ఈ వాహనాల అమ్మకాలు భారీగా పెరగనున్నాయి. ఫలితంగా లిథియం అయాన్‌ బ్యాటరీల మార్కెట్‌ కూడా విస్తరించనుంది. ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ పరిమాణం 2030 నాటికి 5 రేట్లు పెరుగుతుందని ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య సంస్థ లై బ్రిడ్జ్‌ అంచనా వేసింది. ప్రపంచ వ్యాప్తంగా లిథియం ఉత్పత్తి 2021లో లక్ష టన్నులుగా ఉంది. ఇది 90.7 మిలియన్‌ కేజీలతో సమానం. ప్రపంచ వ్యాప్తంగా లిథియం నిల్వలు 22 మిలియన్‌ టన్నులుగా ఉన్నాయని అమెరికా జియోలాజికల్‌ సర్వే స్పష్టం చేసింది.

- Advertisement -

2022 నాటికి చిలీలో ప్రపంచంలోనే అత్యధిక లిథియం నిల్వలు ఉన్నాయి. ఈ దేశంలో 9.3 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల నిల్వలు ఉన్నాయి. రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాలో 6.2 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల నిల్వలు ఉన్నాయి. మన దేశంలోని జమ్ము అండ్‌ కాశ్మీర్‌లో 5.9 మిలియన్‌ మెట్రిక్‌ టన్నుల నిల్వలు బయటపడ్డాయి. అమెరికాలో మొత్తం లిథిలియం నిల్వలు 1 మిలియన్‌ టన్నులుగా ఉంది. లిథియం అయాన్‌ బ్యాటరీల ఉత్పత్తిలోమాత్రం చైనా అగ్రస్థానంలో ఉంది. దీని తరువాత అమెరికా రెండో స్థానంలో ఉంది. ఉత్పత్తితో పాటు లిథియం అయాన్‌ బ్యాటరీల వినియోగంలోనూ ఈ రెండు దేశాలు అగ్రస్థానంలో ఉన్నాయి. చైనా, అమెరికాలో ఎలక్ట్రానిక్‌ గార్జెట్ల వాడకం ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఎలక్ట్రిక్‌ కార్ల వినియోగం కూడా ఈ రెండు దేశాల్లో ఎక్కువగా ఉంది.

వాహనాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా లిథియం అయాన్‌ బ్యాటరీలు ఉపయోగించే మొబైల్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, పోర్టబుల్‌ రేడియోలు, స్పీకర్లు, ఎంపీ3 ప్లేయర్లు వంటి వాటి వినియోగం పెరుగుతున్నది. రీఛార్జ్‌ అనుకూలంగా ఉన్నందున లిథియం అయాన్‌ బ్యాటరీలను వాహనాల్లో వినియోగిస్తున్నారు. 2025 నాటికి లిథియం వినియోగం ఒక మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు పెరుగుతుందని గ్రాండ్‌ వీవ్యూ రీసెర్చ్‌ అంచనా వేసింది. 2025 నాటికి లిథియం కొరత ఏర్పడే అవకాశం ఉందని ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ (ఐఈఏ) తెలిపింది.

ఐఈఏ అంచనా ప్రకారం 2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 2 బిలియన్ల ఈవీలు రోడ్లపైకి వస్తాయి. 2020 లో 3 మిలియన్ల ఈవీల అమ్మకాలు జరిగితే, 2021 నాటికి ఇది 6.6 మిలియన్‌ యూనిట్లకు చేరాయి. విద్యుత్‌ వాహనాల అమ్మకాలు పెరుగుతున్న కొద్దీ, క్రమంగా డీజిల్‌, పెట్రోల్‌ వాహనాల అమ్మకాలు తగ్గుతాయని ఐఈఏ తెలిపింది. 2035 నుంచి గ్యాస్‌, డీజిల్‌, పెట్రోల్‌తో నడిచే వాహనాలను యూరోపియన్‌ పార్లమెంట్‌ నిషేధించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement