Saturday, May 18, 2024

Delhi | బీఆర్ఎస్ బంగాళాఖాతంలో కలవడం ఖాయం : ఈటల రాజేందర్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) విజయ దుందుభి మోగిస్తుందని ఆ పార్టీ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం ఢిల్లీలోని కిషన్ రెడ్డి నివాసంలో కొందరు నేతల చేరిక సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈటల, వ్యక్తులు అటూ ఇటూ మారుతూ ఉండొచ్చు కానీ ప్రజలు మాత్రం నిశ్చమైన అభిప్రాయంతో ఉన్నారని అన్నారు.

ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రావద్దని కోరుకుంటున్నారని, కేసీఆర్ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజలు బ్రతికి బట్టి బట్టకట్టరని ఈటల వ్యాఖ్యానించారు. అనేక సంవత్సరాలుగా అనేక విషయాల మీద ఊదరగొట్టిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నాణ్యతా లోపాల మీద సమాధానం చెప్పడం లేదని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో ఎలా మోసం చేశారో ప్రజలందరూ తెలుసుకున్నారని అన్నారు.

- Advertisement -

కచ్చితంగా తెలంగాణ ప్రజలు ఈసారి ఆ పార్టీని, కేసీఆర్ ను  బంగాళాఖాతంలో ముంచడం ఖాయమని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని లేపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.  కాంగ్రెస్ గత చరిత్ర అంతా జనానికి తెలుసని, అదేమీ కొత్త పార్టీ కాదని అన్నారు. ఇవాళ కొంతమంది ఆ పార్టీలో చేరుతున్నప్పుడు కొంత పెరిగినట్టుగా కనిపిస్తుందని, కానీ ప్రజాక్షేత్రంలో ఆ పార్టీకి విశ్వాసం లేదని అన్నారు.

2014లో కౌన్సిల్లో ఉన్న సభ్యులందరూ నాటి టీఆర్ఎస్ పార్టీలో చేరారని, 2018లో 19 మంది శాసనసభ్యులు కాంగ్రెస్ నుంచి గెలిస్తే 12 మంది ఏకంగా పార్టీని విలీనం చేశారని గుర్తుచేశారు. అలాంటి చరిత్ర కల్గిన కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మరోసారి బీఆర్ఎస్ పంచన చేరరన్న నమ్మకం ప్రజలకు కలగడం లేదని అన్నారు. కేసీఆర్ వద్దు అని కోరుకుంటూ కాంగ్రెస్‌కు ఓటేస్తే చివరకు కేసీఆర్‌కే ఓటేసినట్టు అవుతుందని అన్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌, బీఆర్ఎస్ పార్టీలో ఎవరికి ఓటేసినా ఒకటేనని సూత్రీకరించారు.

కేసీఆర్‌ను గద్దె దించి మంచి పరిపాలన అందించే శక్తి, సత్తా.. భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని గుర్తుచేశారు.  నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం ఎట్లా పురోగమిస్తుందో దేశ ప్రజలు చూస్తున్నారని, తెలంగాణలో కూడా అభివృద్ధి జరగాలంటే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ గెలిస్తేనే డబులింజన్ సర్కారుతో సాధ్యపడుతుందని అన్నారు. అనేకమంది కాంగ్రెస్ నుంచి, బీఆర్ఎస్ నుంచి వచ్చి బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నేతలు ఏ ఊరికి వెళ్లిన కూడా నిరసన సెగలు ఎదురవుతున్నాయని తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement