సుదీర్ఘ కాలం పాటు కొవిడ్ వైరస్ బారినపడిన వారు 10 నిముషాలు నిలబడితే వారి కాళ్ళు నీలం రంగులోకి మారిపోతున్న వైనాన్ని యూకేలోని లీడ్స్ యూనివర్శిటీ చేపట్టిన అధ్యయనం కనుగొందని లాన్సెట్ జర్నల్ పేర్కొంది. కాళ్ళలోని సిరల్లో రక్త ప్రసరణకు సంబంధించి అక్రోసైనోసిస్ అనే స్థితి కారణంగా 33 సంవత్సరాల వ్యక్తిలో వ్యాధి లక్షణం కనిపించిందని సదరు అధ్యయనం తెలిపింది.
ఒక నిముషం సేపు నిలబడిన తర్వాత అతడి కాళ్ళు ఎరుపు రంగులోకి మారిపోయాయి. 10 నిముషాలు నిలబడితే అవి నీలం రంగులోకి మారిపోయాయని పేర్కొంది. అదే సమయంలో కాళ్ళలో భరించలేని దురదను అతడు అనుభవించాడు. అయితే నిలబడటం మానేసిన రెండు నిముషాలకు అతడి కాళ్ళు పూర్వపు రంగును తిరిగి పొందాయి. కొవిడ్ వైరస్ సోకిన నాటి నుంచి నిలబడిన ప్రతిసారి తన కాళ్ళు రంగు మారిపోతున్నట్టు అతడు చెప్పాడని అధ్యయనం చేపట్టిన యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసన్ అసోసియేట్ క్లినికల్ ప్రొఫెసర్ మనోజ్ శివన్ తెలిపారు.