Thursday, May 2, 2024

నత్తనడకన ధాన్యం సేకరణ

ధాన్యం సేకరణ రెండు అడుగులు ముందుకు పది అడుగులు వెనక్కిగా మారింది.. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు వెలవెలబోతున్నాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల వద్ద నిబంధనలు ఉండటంతో మెజార్టీ రైతులు ప్రైవేట్‌ వైపు మొగ్గు చూపుతున్నారు.. ఎక్కువ ధర చెల్లించడం.. డబ్బులు వెంటనే రైతులకు అందించడంతో రైతులు ప్రైవేట్‌గా తాము పండించిన ధాన్యం అమ్ముకుంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2.65 లక్షల మెట్రిక టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని టార్గెట్‌ పెట్టుకోగా ఇప్పటి వరకు కేవలం 5 వేల మెట్రిక టన్నులు కూడా కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం ధాన్యం కొనుగోలు చాలా వరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.

(ప్రభ న్యూస్ బ్యూరో, ఉమ్మడి రంగారెడ్డి) : యాసంగిలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వరి సాగు చేశారు. భూగర్భజలాలు అందు బాటులో ఉండటంతో మెజార్టీ రైతులు వరి వైపే మొగ్గు చూపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2 లక్షల ఎకరాలకు పైగానే వరి నాట్లు వేశారు. ఈసారి పరిస్థితులు అనుకూలించడంతో వరిపంటకు పెద్దగా ఇబ్బందులు కాలేదు. కాకపోతే అకాల వర్షాలు కొంతమేర నష్టాన్ని కలిగించాయి. వేసవికాలంలో వడగండ్ల వర్షాలు రైతులను ఇబ్బందులపాలు చేశాయి. ఐనా ఆశించినమేర దిగుబడి వస్తుందనే నమ్మకంతో రైతులు ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 176 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇందులో 155 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లాలో 37 కేంద్రాలకు 29 ఏర్పాటు చేయగా వికారాబాద్‌ జిల్లాలో 127 కొనుగోలు కేంద్రాలకు 114 ఏర్పాటు చేశారు. మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాలో 12 కేంద్రాలకు 12 ఏర్పాటు చేశారు. వికారాబాద్‌ జిల్లా పరిధిలోని మెజార్టీ ప్రాంతాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో షాద్‌నగర్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధి మినహా అన్ని ప్రాంతాల్లో వరి కోతలు చాలా రోజుల క్రితమే ప్రారంభమయ్యాయి. మేడ్చల్‌ జిల్లాలో కూడా వరి కోతలు ప్రారంభమయ్యాయి. కానీ కొనుగోళ్లు మాత్రం ఆశించినమేర జరగడం లేదు.

సేకరించింది ఐదువేల మెట్రిక్‌ టన్నులే..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 2.65లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం ఐదువేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే సేకరించారు. వికారాబాద్‌ జిల్లాలో రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించాల్సి ఉంది. ఈ జిల్లాలో ఏకంగా 1.75లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాల్సి ఉండగా ఇక్కడ ఇప్పటివరకు 1800 మెట్రిక్‌ టన్నుల వరకే ధాన్యం సేకరించారు. రంగారెడ్డి జిల్లాలో 60వేల మెట్రిక్‌ టన్నులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటివరకు కేవలం రెండువేల మెట్రిక్‌ టన్నులే సేకరించారు. మేడ్చల్‌మల్కాజ్‌గిరి జిల్లాలో కూడా అదే పరిస్థితి నెలకొంది. ఈ జిల్లాలో 30వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని భావించారు. ఇప్పటివరకు 1200 మెట్రిక్‌ టన్నులే సేకరించారు.కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కోతలు పెండింగ్‌లో ఉన్నాయి. మెజార్టీ ప్రాంతాల్లో వరి కోతలు పూర్తి చేశారు. ఐనా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అనుకున్న మేర ధాన్యం సేకరణ జరగడం లేదు.

- Advertisement -

ప్రైవేట్‌ వైపు రైతుల మొగ్గు..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నిబంధనలు అమలులో ఉన్నందునా మెజార్టీ రైతులు ప్రైవేట్‌గా అమ్ముకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ధరతోపాటు సకాలంలో డబ్బులు చేతికి అందుతుండటం, రవాణా కర్చులు మిగిలిపోతుండటంతో ప్రైవేట్‌ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల వద్ద తరుగు పేరుతో బస్తాకు మూడు కిలోలు తగ్గిస్తున్నారు. దాంతోపాటు రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకెళ్లాల్సి ఉంటుంది. దాంతోపాటు సకాలంలో డబ్బులు చేతికి రాని పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేట్‌ వ్యక్తులు నేరుగా రైతుల పొలాల వద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. దాంతోపాటు వారికి వెంటనే డబ్బులు చెల్లిస్తున్నారు. తరుగు అసలే తీయడం లేదు. దానికితోడు రవాణా కర్చులు కూడా మిగిలిపోతున్నాయి. ధరలో కూడా వ్యత్యాసం ఉంటోంది. ప్రభుత్వం క్వింటాల్‌కు రూ. 2060 ఏ గ్రేడ్‌కు చెల్లిస్తున్నారు. ప్రైవేట్‌ వ్యక్తులు రూ. 2300వరకు చెల్లిస్తున్నారు. డబ్బులు ఆలస్యం చేయకుండా వెంటనే చెల్లిస్తుండటంతో చాలామంది రైతులు ప్రైవేట్‌ వ్యక్తులకు ధాన్యం అమ్మేందుకు మొగ్గు చూపుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరి కోతలు మరో 15రోజుల్లో ప్రారంభం కానున్నాయి. వీరంతా ఎటువైపు వెళ్తారనేది వేచి చూడాలి. ప్రస్తుత లెక్కల ప్రకారం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఆశించినమేర ధాన్యం సేకరించడం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement