Sunday, October 13, 2024

రైతులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త.. యాసంగి ధాన్యం కొనుగోళ్లు షురూ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలను యుధ్ధ ప్రాతిపదికన ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, సివిల్‌సప్లై శాఖ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ను ఆదేశించారు. ప్రస్తుత యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు వీలుగా తక్షణ చర్యల్లో భాగంగా సోమవారం ఉదయం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలన్నారు. రైతులకు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కు కలెక్టర్లు చర్యలు చేపట్టేవిధంగా చర్యలు తీసుకోవాలని సీఎస్‌ శాంతి కుమారిని ప్రత్యేకంగా అభినందించారు. గతంలో నిర్వహించిన విధంగానే 7వేల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈ సారి కూడా ప్రారంభించాలన్నారు. రోజుల వ్యవథిలోనే రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కావాలని నిర్ధేశించారు.

దళారులకు ఆగడాలకు చెక్‌పెట్టిన సీఎం కేసీఆర్‌…

యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని నిర్ణయించడం ద్వారా సీఎం కేసీఆర్‌ ప్రయివేటు అడ్తీ వ్యాపారులు, దళారుల దోపీడికి చెక్‌పెట్టడంతోపాటు వారి దోపీడి నుంచి రైతులకు విముక్తి కల్పించారు. వడగళ్లు, అకాల వర్షాల భయానికి రైతులు ఈ యాసంగిలో వారం, పది రోజుల ముందుగానే వరికోతలు ప్రారంభించారు. ఇదే అదనుగా ప్రయివేటు వ్యాపారులు రైతుల పొలాల వద్దకే వచ్చి ట్రాన్స్‌ పోర్టు ఛార్జీ లేదని, ధాన్యాన్ని ఎండబోయాల్సిన అవసరం లేదని మభ్యపెడుతూ ఊళ్లలోనే క్వింటాల్‌కు రూ.1600 నుంచి రూ.1650కే కొనుగోలు చేస్తున్నారు. దాదాపు క్వింటాకు రూ.400 మేర ధర తగ్గుతున్నా వడగళ్లు, అకాల వర్షాల భయానికి రైతులు ప్రయివేటు వ్యాపారులకు పంటను అమ్మాల్సి వస్తోంది. అయితే తాజాగా యాసంగి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించడంతో రైతుల ఆర్థిక కష్టాలు దూరం కానున్నాయి. ఊళ్లోనే క్వింటా ధాన్యానికి రూ.2100 చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేయనుంది.

- Advertisement -

ఈ యాసంగిలో రికార్డుస్థాయిలో వరి సాగు…

యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్‌ నిర్ణయాన్ని ప్రకటించడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. తెలంగాణలో ఈ ఏడాది యాసంగిలో గతంలో ఎప్పుడూ లేనంతగా ఏకంగా 57 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. గత సంవత్సరం యాసంగిలో దాదాపు 40లక్షల ఎకరాల్లో వరి సాగు అవగా ఈ ఏడాది 17లక్షల ఎకరాల్లో అధికంగా వరిసాగు అయింది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు చోట్ల యాసంగి వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది యాసంగి ధాన్యం కొనుగోళ్లు ఉంటాయా..? ఉండవా..? అని రైతులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ వినిపించిన తీపి క బురుతో రైతుల కళ్లల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా ఎంత లేదన్నా 1.40కోట్ల మెట్రిక్‌ టన్నుల వరి దిగుబడి వచ్చే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. రైతులు తమ ఆహార అవసరాలకు దాదాపు 25లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని వినియోగించుకున్నా ఎంత లేదన్నా కోటి 20లక్షల టన్నుల వరి ధాన్యం దిగుబడి రానుందని అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement