Friday, May 3, 2024

Follow up | స్కాం కేసుల్లో దీపావళి తర్వాతే.. తేలనున్న చంద్రబాబు భవిష్యత్తు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై దీపావళి సెలవుల అనంతరం తీర్పు వెలువడనుంది. గురువారం ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టగా.. స్కిల్ స్కాం కేసులో తీర్పు ఇచ్చిన తర్వాతనే బెయిల్ పిటిషన్‌పై విచారణ జరుపుతామని తెలియజేసింది.

ఈ సందర్భంగా దీపావళి సెలవుల అనంతరం స్కిల్ స్కాం కేసులో తీర్పు వెలువరిస్తామని వెల్లడించింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందా లేదా అన్న అంశంపై సుదీర్ఘంగా జరిగిన వాదనల అనంతరం సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసిన విషయం తెలిసిందే. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేదితో కూడిన ధర్మాసనం ఈ కేసు విచారణ జరిపి, తీర్పును రిజర్వు చేసింది.

ఇదే బెంచ్ ఫైబర్‌నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారణ జరుపుతోంది. అందుకే రిజర్వు చేసిన తీర్పును వెలువరించిన తర్వాత బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని ఇరుపక్షాల న్యాయవాదులకు చెబుతూ కేసు తదుపరి విచారణను నవంబర్ 23కు వాయిదా వేస్తామని ధర్మాసనం తెలపగా, చంద్రబాబు నాయుడు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా నవంబర్ 30కి వాయిదా వేయాలని కోరారు.

- Advertisement -

లూత్రా అభ్యర్థన మేరకు కేసు తదుపరి విచారణ నవంబర్ 30కి వాయిదా వేస్తున్నట్టు ధర్మాసనం వెల్లడించింది. అప్పటి వరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. చంద్రబాబు నాయుడుకు అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌ మంజూరైందని ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి తెలిపారు.

గతంలో తాము చెప్పినట్టుగా ఫైబర్‌నెట్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసే వరకు చంద్రబాబు అరెస్టు ఉండబోదమని ఆయన స్పష్టం చేశారు. ఫైబర్‌నెట్ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో ఆ తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఆ సమయానికి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరుపుతోంది.

అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ) ప్రకారం చంద్రబాబుపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం నుంచి అరెస్ట్ చేసే వరకు ముందస్తు అనుమతి తప్పనిసరి అంటూ ఆయన తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్ సీఐడీ విభాగం ఆ పని చేయలేదు కాబట్టి నమోదు చేసిన ఎఫ్.ఐ.ఆర్‌ను క్వాష్ (రద్దు) చేయాలంటూ అభ్యర్థించారు. ఇదే అభ్యర్థనతో ఏపీ హైకోర్టును ఆశ్రయించగా, హైకోర్టు తిరస్కరించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.

సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తూ.. సెక్షన్ 17(ఏ) సవరణ అమల్లోకి రాకముందే ఈ నేరం జరిగిందని, నేరం జరిగిన సమయానికి ఉన్న చట్టం ప్రకారమే తాము కేసు విచారణ చేపట్టామని చెప్పారు. చంద్రబాబు నాయుడు విషయంలో ఈ సెక్షన్ వర్తించదని వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనల అనంతరం సుప్రీంకోర్టు తీర్పును రిజర్వు చేసింది. ఈ తీర్పు నవంబర్ మొదటి వారంలోనే వస్తుందని అందరూ భావించారు. కానీ గురువారం ఫైబర్‌నెట్ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం దీపావళి సెలవుల అనంతరం స్కిల్ స్కాం కేసులో తీర్పు వెలువరిస్తామని స్పష్టం చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement