Saturday, May 18, 2024

Delhi | చంద్రబాబును మిలటరీ ఆస్పత్రికి తరలించాలి.. రాష్ట్రపతికి తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మిలటరీ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని తెలుగు శక్తి సంస్థ అధ్యక్షులు బీవీ రామ్ కోరారు. ఈ మేరకు ఆయన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఓ లేఖ రాసి, దాన్ని స్వయంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అందజేశారు.

రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు చర్మ సంబంధం సమస్యలతో బాధపడుతున్నారని, అయినా సరే చర్మ సంబంధ వ్యాధులకు చికిత్స అందించే డెర్మటాలజిస్టును అక్కడికి పంపించలేదని లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్యంతో పాటు భద్రత విషయంలో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని, ఈ పరిస్థితుల్లో జైలు నుంచి సికింద్రాబాద్ లేదా ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించేలా ఆదేశాలు జారీ చేయాలని బీవీ రామ్ రాష్ట్రపతిని కోరారు.

చంద్రబాబు కేవలం ఆంధ్రప్రదేశ్‌కు పరిమితమైన వ్యక్తి కాదని, జాతీయస్థాయి నాయకుడని రామ్ తెలిపిారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొమ్మిదేళ్లు, విభజిత ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం లేనిపోని కేసులు మోపి జైల్లో పెట్టిందని ఆరోపించారు. అనంతరం ఢిల్లీలో వైఎస్సార్సీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజును కలిశారు. చంద్రబాబు నాయుడు ఆరోగ్యంపై రాష్ట్రపతికి రాసిన లేఖ గురించి ఆయనకు వివరించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement