Sunday, October 13, 2024

National : అఖిలేశ్​కు సీబీఐ స‌మ‌న్లు…..నేడు విచార‌ణ‌..

యూపీలో అక్రమ గనుల కేటాయింపుల కేసుల్లో విచారణ నిమిత్తం గురువారం తమ ఆఫీస్‌కు రావాలని మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ను సీబీఐ ఆదేశించింది. ఈ మేరకు బుధవారం ఆయనకు సమన్లు జారీచేసింది. సాక్షిగా హాజరైతే వాంగ్మూలం నమోదుచేసుకుంటామని ఆ సమన్లతో పేర్కొంది. ఈ-టెండర్‌ ప్రక్రియను పూర్తిగా ఉల్లంఘించారని, ప్రభుత్వ అధికారులు ఈ మైనింగ్‌ లీజుల కేటాయింపుల్లో పాలుపంచుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.

దీంతో సీబీఐ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తునకు అలహాబాద్‌ హైకోర్టు గతంలో ఆదేశించింది. అఖిలేశ్‌ యాదవ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న 2012-16కాలంలోనే జాతీయ హరిత ట్రిబ్యూనల్‌ నిషేధించినా ఈ అక్రమ మైనింగ్‌కు తెరలేపారని సీబీఐ పేర్కొంది. 2019లో నమోదైన కేసులో భాగంగా అఖిలేశ్‌కు సమన్లు పంపామని, ఆయన ఈ కేసులో నిందితుడు కాదని, సాక్షి మాత్రమేనని సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. సీబీఐ సమన్లపై అఖిలేశ్‌ స్పందించారు.

- Advertisement -

”ఎన్నికలు వ‌చ్చినప్పుడల్లా నాకు నోటీసులొస్తాయి. 2019 లోక్‌సభ ఎన్నికల వేళా ఇలాగే జరిగింది. బీజేపీ ఎక్కువగా లక్ష్యంగా చేసుకున్నది మా పారీ్టనే. గత పదేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉంటూ ఎంతో అభివృద్ధిచేశామని చెబుతుంటారు. అలాంటపుడు సమాజ్‌వాదీ పార్టీ అంటే బీజేపీకి ఎందుకంత కంగారు?. యూపీలో ఎక్స్‌ప్రెస్‌వేపై హెర్క్యులెస్‌ రకం విమానంలో మోదీ దిగారు. కానీ ఆ ఎక్స్‌ప్రెస్‌వేలను కట్టింది ఎస్పీ సర్కార్‌. అలాంటి జాతీయ రహదారులను మీరు వేరే రాష్ట్రాల్లో ఎందుకు కట్టలేకపోయారు?” అంటూ బీజేపీపై అఖిలేశ్‌ నిప్పులు చెరిగారు.

ఏమిటీ కేసులు?
హమీర్‌పూర్‌ జిల్లా గనుల్లో తక్కువ విలువైన ఖనిజాలను లీజుకిచ్చి లీజు హక్కుదారుల నుంచి ప్రభుత్వ అధికారులు ముడుపులు తీసుకున్నారని సీబీఐ ఏడు కేసులు నమోదుచేసింది. 2012-17లో అఖిలేశ్‌ సీఎంగా ఉంటూనే 2012-13లో గనుల శాఖ మంత్రిగా కొనసాగారు. అప్పుడే 2013 ఫిబ్రవరి 17న ఒకేరోజు 13 ప్రాజెక్టులకు సీఎం ఈ-టెండర్లను పక్కనబెట్టి పచ్చజెండా ఊపారని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసుల్లో నాటి హమీర్‌పూర్‌ జిల్లా మేజి్రస్టేట్, ఐఏఎస్‌ అధికారిణి బి.చంద్రకళ, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ రమేశ్‌కుమార్‌ సహా 11 మందిపై సీబీఐ కేసులు వేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement