Monday, April 29, 2024

Delhi | విపత్తుల వార్తాసేకరణలో జాగ్రత్త.. మీడియా ప్రతినిధులకు కేంద్రం సూచన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రపంచంలో ఏ మూల ఏ విపత్తు జరిగినా ఆ సమాచారాన్ని అందించేందుకు రంగంలోకి దిగేది మీడియానే. అందులోనూ అనుక్షణం వార్తలందించే టెలీవిజన్, డిజిటల్ మీడియా ప్రతినిధులైతే విపత్తు జరిగిన ప్రదేశం నుంచే నేరుగా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వార్తలు అందిస్తుంటారు. విపత్తుల సమయంలో ఒక్కోసారి ప్రమాదాల బారిన పడుతుంటారు. తాజాగా గుజరాత్ తీరంపై విరుచుకుపడ్డ “బిపర్జోయ్” తుఫాను వార్తలను సేకరించి అందించేందుకు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మీడియా సిబ్బంది భద్రతపై కేంద్ర సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. భద్రత విషయంలో రాజీ పడవద్దని, పూర్తిస్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని మీడియా సంస్థలను మంత్రిత్వ శాఖ కోరింది.

వివిధ మీడియా సంస్థలకు చెందిన రిపోర్టర్లు, కెమెరామెన్ మరియు ఇతర సిబ్బంది భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ సూచనలు, మార్గదర్శకాలు జారీ చేసింది. ఏకాస్త ఏమరుపాటుగా, అజాగ్రత్తగా ఉన్నా జీవితాలు ప్రమాదంలో పడతాయని హెచ్చరించింది. ప్రభుత్వం, వాతావరణ శాఖ వంటి ప్రభుత్వ విభాగాల సూచనలు, హెచ్చరికలను మీడియా సంస్థల నిర్వాహకులు దృష్టిలో పెట్టుకుని తమ సిబ్బందిని ఆయా ప్రాంతాల్లో విధుల్లోకి పంపించాలని సూచించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ హెచ్చరికలను పెడచెవిన పెడుతూ నిర్ణయాలు తీసుకోవద్దని సిఫార్సు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement