Thursday, October 31, 2024

Delhi | డిజిటల్ ఇండియా విస్తరణకు కేబినెట్ ఆమోదం.. 14,903 కోట్లతో ప్రణాళికలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: డిజిటల్ ఇండియా ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ క్రమంలో ‘డిజిటల్ ఇండియా’ పథకాన్ని మరింత విస్తరించేందుకు రూ.14,903 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధపడింది. ఇవ్వాల (బుధవారం) ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఈ విస్తరణకు ఆమోదం తెలిపింది. 2015 జూలై 1న ప్రారంభమైన డిజిటల్ ఇండియా కార్యక్రమం విజయవంతంగా అమలవుతోంది. విస్తరణ ద్వారా మరిన్ని సేవలను, మరింత వేగవంతంగా, సమర్థవంతంగా అందించాలన్నదే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.

విస్తరణలో భాగంగా అమలుకానున్న కార్యక్రమాలు:

ఫ్యూచర్‌స్కిల్స్ ప్రైమ్ ప్రోగ్రామ్ కింద 6.25 లక్షల మంది ఐటీ నిపుణుల వృత్తి నైపుణ్యాలను మరింత మెరుగుపరిచేందుకు శిక్షణ కార్యక్రమాలు అమలు చేస్తారు.

ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అండ్ ఎడ్యుకేషన్ అవేర్‌నెస్ ఫేజ్ (ISEA) ప్రోగ్రామ్ కింద 2.65 లక్షల మందికి  శిక్షణ అందిస్తారు.

- Advertisement -

యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ-ఏజ్ గవర్నెన్స్ (UMANG) యాప్/ ప్లాట్‌ఫారమ్ కింద 540 అదనపు సేవలు అందుబాటులోకి వస్తాయి.

*  ప్రస్తుతం యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ-ఏజ్ గవర్నెన్స్‌లో 1,700 పైగా సేవలు అందుబాటులో ఉన్నాయి;

* నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్ కింద మరో 9 సూపర్ కంప్యూటర్లు ఏర్పాటవుతాయి. ఇప్పటికే  నేషనల్ సూపర్ కంప్యూటర్ మిషన్ కింద 18 సూపర్ కంప్యూటర్లు అందుబాటులో ఉన్నాయి.

* ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కింద ప్రారంభమైన  ‘భాషిని’ బహుళ-భాషా అనువాద సాధనం (ప్రస్తుతం 10 భాషల్లో అందుబాటులో ఉంది) మొత్తం షెడ్యూల్ 22లో పొందుపరిచిన 8 భాషల్లో విడుదల అవుతుంది.

* 1,787 విద్యాసంస్థలను అనుసంధానించి పనిచేస్తున్న  నేషనల్ నాలెడ్జ్ నెట్‌వర్క్ (NKN) ఆధునికీకరణ

* డిజి-లాకర్  కింద డిజిటల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ సదుపాయం ఇకపై ఎంఎస్ఎంఈ, ఇతర సంస్థలకు కూడా అందుబాటులోకి వస్తుంది.  

* టైర్ 2, టైర్ 3 నగరాల్లో 1,200 స్టార్టప్‌లకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది.

* ఆరోగ్యం, వ్యవసాయం సుస్థిర  నగరాల అభివృద్ధి కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో 3 అత్యుత్తమ కేంద్రాలు ఏర్పాటు అవుతాయి.

* 12 కోట్ల మంది కళాశాల విద్యార్థులకు సైబర్-అవగాహన కోర్సులు అందిస్తారు.

* నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్‌తో 200 కి మించి  సైట్‌ల ఏకీకరణతో టూల్స్ అభివృద్ధి  సహా సైబర్ సెక్యూరిటీ రంగంలో కొత్త కార్యక్రమాలు అమలు జరుగుతాయి.

కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయంతో దేశంలో  డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.  డిజిటల్ సేవలు మరింత ఎక్కువగా అందుబాటులోకి వస్తాయి. దేశంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల అభివృద్ధికి ప్రభుత్వ నిర్ణయం తోడ్పాటునిస్తుంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement