Saturday, June 1, 2024

బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏపీకి.. తెలంగాణకు కేంద్రం మొండిచేయి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌లో బల్క్‌డ్రగ్‌ ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మాత్రం పార్కు ఇచ్చే విషయంలో మొండిచేయి చూపించింది. కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ పరిధిలోని ఫార్మాసుటికల్‌ విభాగం నుంచి బల్క్‌ డ్రగ్‌ పార్కుకు సంబంధించి ఏపీ చీఫ్‌ సెక్రటరీకి ఈమేరకు గురువారం లేఖ అందినట్లు సమాచారం. వారం రోజుల్లోగా ఈ పార్కును చేపట్టేందుకు అవసరమైన సమ్మతిని తెలుపుతూ లేఖ పంపాలని ఏపీ ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. బల్క్‌ డ్రగ్‌ పార్కు ఏర్పాటు కోసం తెలంగాణతో పాటు తమిళనాడు రాష్ట్రం కూడా పోటీ పడగా చివరకు ఏపీ వైపే కేంద్రం మొగ్గు చూపింది. ఈ పార్కు ఏపీలోని కాకినాడలో ఏర్పాటు కానుంది.

ఫార్మాసిటీ అభివృద్ధికి రూ.1000 కోట్లు ఆశించిన ప్రభుత్వం…

బల్క్‌ డ్రగ్‌ పార్కు గనుక తెలంగాణకు కేంద్రం మంజూరు చేస్తే ఈ పార్కు ఏర్పాటుకు కేంద్రం నుంచి వచ్చే సుమారు రూ. 1000 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హైదరాబాద్‌ శివార్లలో ఏర్పాటు చేస్తోన్న ప్రతిష్టాత్మక ఫార్మాసుటికల్‌ పార్కు ఫార్మాసిటీకి వాడుకుందామని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే అన్ని అంశాల్లోలానే కేంద్ర ప్రభుత్వం ఈ అంశంలోనూ కేంద్రం రాష్ట్రానికి మొండి చేయి చూపించడంతో రాష్ట్ర ప్రభుత్వ ఆశలు అడియాశలయ్యాయి. 70 శాతం వరకు చైనా నుంచి దిగుమతవుతున్న బల్క్‌ డ్రగ్‌ల తయారీని దేశీయంగా ప్రోత్సహించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని, అయితే ఇదే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్‌ ఫార్మాసుటికల్‌ పార్కుగా ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీకి నిధులివ్వకుండా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పరిశ్రమ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement