Tuesday, May 14, 2024

Delhi | ఎన్నికల గుర్తులపై పిటిషన్ ఉపసంహరణ.. నేరుగా సుప్రీంను ఆశ్రయించాలని బీఆర్ఎస్ నిర్ణయం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎన్నికల గుర్తు ‘కారు’ను పోలిన రోడ్డు రోలర్, రోటీ కర్ర, కెమేరా, టెలీవిజన్ వంటి గుర్తులను ఎన్నికల్లో ఏ ఇతర పార్టీ లేదా అభ్యర్థికి కేటాయించవద్దని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఆ పార్టీ వెనక్కి తీసుకుంది. ఈ అంశంపై నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించుకుంది. ఇప్పటికే ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించిన బీఆర్ఎస్ నేతలు, అక్కణ్ణుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తొలుత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.

ఆ పిటిషన్ గురువారం విచారణకు రానుండగా, విత్ డ్రా చేసుకుంటున్నట్టు బీఆర్ఎస్ తరఫు న్యాయవాదులు తెలిపారు. ఈ వ్యవహారంపై నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని పార్టీ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున ఆలస్యం చేయకుండా సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఉత్తర్వులు వచ్చేలా ప్రయత్నించాలని భావిస్తోంది. హైకోర్టులో కేసును కొనసాగిస్తే.. అక్కడ తీర్పు తాము కోరుకున్నప్పుడు రానిపక్షంలో మళ్లీ సుప్రీంకోర్టునే ఆశ్రయించాల్సి ఉంటుంది.

కానీ అప్పటికే సమయం గడచిపోతే ఎన్నికల నోటిఫికేషన్, నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తవుతుంది. పైగా వచ్చే వారం నుంచి న్యాయస్థానాలకు దసరా సెలవులు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పిటిషన్ వెనక్కి తీసుకున్నట్టు తెలిసింది. గత నెల 27న బీఆర్ఎస్ ఎంపీలు మన్నె శ్రీనివాస రెడ్డి, వెంకటేశ్ నేత, పార్టీ ప్రధాన కార్యదర్శి మ భరత్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఎన్నికల గుర్తులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లేఖలు అందజేశారు.

గుర్తును పోలిన గుర్తులతో ఓటర్లు గందరగోళానికి గురవుతున్నారని, తద్వారా తమకు చెందాల్సిన ఓట్లు గల్లంతవుతున్నాయని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. తమ గుర్తును పోలిన మరికొన్ని గుర్తులు ఫ్రీ సింబల్ జాబితాలో ఉన్నాయని, వాటిలో ‘టోపీ’, ‘ఇస్త్రీ పెట్టె’, ట్రక్, ఆటో రిక్షా, రోడ్డు రోలర్ వంటివి కారు గుర్తుకు సారూప్యంగా ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో పలువురు ఓటర్లు రోడ్డు రోలర్ గుర్తును కారు గుర్తుగా పొరబడి ఓట్లు వేశారని, తద్వారా బీఆర్ఎస్‌కు దక్కాల్సిన ఓట్లు ఆ గుర్తుకు వెళ్లాయని కొన్ని ఉదాహరణలతో సహా వివరించారు.

- Advertisement -

అలాగే ‘యుగ తులసి’ పార్టీకి రోడ్డు రోలర్ గుర్తును కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. ఆ గుర్తును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. యుగ తులసి పార్టీకి రోడ్డు రోలర్ గుర్తును కేటాయించడం ఎలక్షన్ సింబల్స్ (రిజర్వేషన్స్ అండ్ అలాట్‌మెంట్) ఆర్డర్, 1968 లోని పారా 10(బీ) స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ‘యుగ తులసి’ పార్టీ బీఆర్ఎస్‌ను దెబ్బతీయాలన్న దురుద్దేశంతోనే రోడ్డు రోలర్ గుర్తును ఎంపిక చేసుకుందని వెల్లడించారు.

ముఖ్యంగా వృద్ధ ఓటర్లు, చూపు సరిగాలేని ఓటర్లు ఈ గుర్తుల విషయంలో గందరగోళానికి గురవుతున్నారని బీఆర్ఎస్ నేతలు తెలిపారు. గతంలో జరిగిన ఎన్నికల్లో రోడ్డు రోలర్ గుర్తు ద్వారా తమకు జరిగిన నష్టాన్ని వివరించే ఉదాహరణలు, గణాంకాలు, ఇతర ఆధారాలను ఎన్నికల సంఘానికి సమర్పించామని తెలిపారు.

2011లో కేంద్ర ఎన్నికల సంఘం రోడ్డు రోలర్ గుర్తును తొలగించిందని, కానీ ఆ తర్వాత కొన్ని పరిణామాలతో ఆ గుర్తును మళ్లీ ఫ్రీ సింబల్స్ జాబితాలో చేర్చిందని పార్టీ నేతలు ఆరోపించారు. తమ ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతోనే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వచ్చిందని ఆ పార్టీ నేతలు వెల్లడించారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement