Friday, April 19, 2024

లోక్ స‌భ నుంచి రాహుల్ గాంధీ బ‌హిష్క‌ర‌ణ‌కు బిజెపి రంగం సిద్ధం..

న్యూఢిల్లి: కాంగ్రెస్‌ పార్టీ యువనేత రాహుల్‌గాంధీని చట్టసభ చట్రంలో ఇరికించాలని బీజేపీ వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తున్నది. పార్లమెంటులో తన వాణిని వినిపించేందుకు అనుమతించాలని రాహుల్‌గాంధీ పట్టుబడుతున్నారు. విదేశీ గడ్డపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్‌ చేస్తున్నది. ససేమిరా అంటున్నారు రాహుల్‌గాంధీ. ముందు క్షమాపణ చెబితేనే లోక్‌సభలో మాట్లాడనిస్తామని అధికార పక్షం బీజేపీ చెబుతోంది. దీనిమీదే నిత్యం పార్లమెంటు ఉభయ సభల్లో గొడవ జరుగుతున్నది. వాయిదాల మీద వాయిదాలు పడి, చివరకు మర్నాటికి ఉభయసభలు వాయిదా పడుతు న్నాయి. ఇది ఇంతటితో పోయేలా లేదు. రాహుల్‌గాంధీ వ్యాఖ్యల పై పార్లమెంటరీ ప్రత్యేక కమిటీతో విచారణ చేయించాలని కూడా బీజేపీ డిమాండ్‌ చేస్తున్నది. తద్వారా ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పని నిరూపించి, ఆయన మీద చర్యలు తీసుకునేదాకా వెళ్లాలని అధికారపక్షం భావిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలి సింది.

భారతదేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయింది అంటూ బ్రిటన్‌లో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంటున్నది. ఒకవంక అంతర్జాతీయ స్ధాయిలో తాము తీసుకుంటున్న వివిధ నిర్ణయా లు, విధానాల ద్వారా దేశప్రతిష్ట ఇనుమడిస్తున్న వేళ, విదేశాలకు వెళ్లి రాహుల్‌గాంధీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ అవమానకరంగా భావిస్తున్నది. దీనికితోడు హిండెన్‌బర్గ్‌ నివేదిక ఆసరా చేసుకుని, అదానీకి, మోడీకి సంబంధాలు అంటగట్టి మోదానీ అంటూ కొత్త పదబంధాలు సృష్టించి మరీ అప్రతిష్టపాల్జేస్తున్నారన్నది అధికారపక్షం భావనగా ఉంది. అందుకే బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దూబే లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు ఈమేరకు లేఖ రాశారు. రాహుల్‌ వ్యాఖ్యలపై ప్రత్యేక పార్లమెంటరీ కమిటీ వేసి, విచారణ జరిపించాలని ఆ లేఖలో కోరారు. ఆ కమిటీ నివేదిక నెలరోజుల్లో వస్తుందని, కమిటీ ఇచ్చే నివేదికను బట్టి రాహుల్‌గాంధీని లోక్‌సభ నుంచి బహిష్కరించవచ్చునని బీజేపీ వ్యూహకర్తలు భావిస్తున్నట్టు చెబుతున్నారు.

యుపియే-1 ప్రభుత్వ హయాంలో ఓట్లకోసం నోట్లు కుంభకోణంలో 2008లో ఇలాగే పార్లమెంటరీ ప్రత్యేక కమిటీ వేశారు. అది ఇచ్చిన నివేదక ఆధారంగా లోక్‌సభ నుంచి పదిమందిని, రాజ్యసభ నుంచి ఒకరిని బహిష్కరించారు. తాజా సందర్భంలో కమిటీ వేసి, అది నివేదిక ఇస్తే, దాన్ని అమలుచేయడానికి బీజేపీకి ఎలాంటి అవాంతరాలు ఉండవు. పార్లమెంటులో బీజేపీకి తగినంత సంఖ్యాబలం ఉన్న సంగతి తెలిసిందే. రాహుల్‌గాంధీ గురువారం లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను కలిసి, సభలో మాట్లాడేందుకు తనకు అవకాశం కల్పించాలని కోరారు. అయితే స్పీకర్‌ విని, నవ్వి ఊరుకున్నారని, ఎలాంటి హామీ ఇవ్వలేదని ఆతర్వాత రాహుల్‌గాంధీ చెప్పారు. ఈ సంఘటనకు ముందే..అంటే బుధవారమే నిషికాంత్‌ దూబే స్పీకర్‌కు లేఖ అందజేశారు. దీన్నిబట్టి అధికారపక్షం రాహుల్‌ విషయంలో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేసిందని కాంగ్రెస్‌ నేతలు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, రాహుల్‌ గాంధీ క్షమాపణ చెప్పేంతటి వ్యాఖ్యలేమీ చేయలేదని, ఆయన క్షమాపణ చెప్పాల్సిన అవసరం అంతకన్నా లేదని కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ వ్యాఖ్యానించారు. మొత్తంమీద నిత్యం పార్లమెంటు వాయిదాలకు కారణంగా నిలిచిన వివాదం తీవ్రమైన మలుపులు తిరిగే దిశగా అడుగులు వేస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement