Friday, May 10, 2024

Big Story | బిపర్‌జాయ్‌ రెడ్‌అలర్ట్‌.. దూసుకొస్తున్న తుపాను

అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపర్‌జాయ్‌ తుపాను గుజరాత్‌ తీరం వైపు దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సౌరాష్ట్ర, ద్వారక, కచ్‌ తీర ప్రాంతాలకు రెడ్‌అలర్ట్‌ జారీచేసింది. నేడుతీరాన్ని తాకనున్న తుపాను, కచ్‌లోని జఖౌ పోర్టు సమీపంలో సాయంత్రానికి తీరం దాటుతుందని ఐఎండీ పేర్కొంది. తుపాను ప్రభావం గుజరాత్‌పై తీవ్రస్థాయిలో ఉండొచ్చని, రాష్ట్రంలో పెను విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉందని వెల్లడించింది.

తుపాను తీరాన్ని తాకే సమయంలో గరిష్ఠంగా గంటకు 125-150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. సౌరాష్ట్ర, కచ్‌ తీరాల్లో 6 మీటర్ల ఎత్తున కెరటాలు ఎగసిపడతాయని అధికారులు తెలిపారు. తుపాను ముంచుకొస్తుండటంతో ఇప్పటికే గుజరాత్‌ అల్లకల్లోలంగా మారింది. రాష్ట్రంలోని కచ్‌, ద్వారక, పోర్‌ బందర్‌, జామ్‌ నగర్‌, మోర్బీ, జునాగఢ్‌, రాజ్‌ కోట్‌ తదితర జిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.

పలు చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి. ఇళ్ల పైకప్పులు గాలికి ఎగిరిపోయాయి. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. లోతట్టు కాలనీల్లోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేడు, రేపు కూడా ఆయా ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు గుజరాత్‌ లోని సౌరాష్ట్ర, ద్వారక, కచ్‌ తీరాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

- Advertisement -

అధికార యంత్రాంగం అప్రమత్తత..

ఐఎండీ హెచ్చరికలతో రాష్ట్ర యంత్రాంగం అప్రమత్తమైంది. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దాదాపు 50 వేల మందిని తాత్కాలిక షెల్టర్లకు తరలించారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 95 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. జూన్‌ 15 వరకు ఈ రైళ్లను తాత్కాలికంగా క్యాన్సల్‌ చేసినట్లు వెల్లడించారు. విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్‌డిఆర్‌ఎఫ్‌), స్టేట్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎస్‌డిఆర్‌ఎఫ్‌) రంగంలోకి దిగాయి. మొత్తం 17 ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలు గుజరాత్‌కు చేరుకున్నాయి. వీటిలో నాలుగు బృందాలను కచ్‌లో మోహరించగా, ద్వారక, రాజ్‌కోట్‌లలో మూడు బృందాలు, జామ్‌నగర్‌లో రెండు, పోరు బందర్‌లో ఒక బృందాన్ని మోహరింపజేశారు.

8 రాష్ట్రాలకు వర్షసూచన

మరోవైపు తుపాను ప్రభావంతో గుజరాత్‌ సహా ఎనిమిది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గుజరాత్‌, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, గోవా రాష్ట్రాలతోపాటు డామన్‌ డయ్యూ, లక్షద్వీప్‌, దాద్రానగర్‌ హవేలీ కేంద్రపాలిత ప్రాంతాలకు ఐఎండీ హెచ్చరికలు జారీచేసింది. ఇక రాజస్థాన్‌ లో జూన్‌ 16వ తేదీ నుంచి ఈ తుపాను ప్రభావం ఉండనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. జోధ్‌పూర్‌, ఉదయ్‌పూర్‌ డివిజన్లలో అనేక చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 60 కిమీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

పాకిస్తాన్‌లోనూ హైఅలర్ట్‌

బిపర్‌జాయ్‌ తుఫాన్‌ పాకిస్థాన్‌లోనూ ప్రభావం చూపుతోంది. తీర ప్రాంతం వెంట నివసిస్తున్న వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చిన్న చిన్న దీవుల్లో ఉన్నవారిని కూడా తరలిస్తున్నారు. గురువారం రోజున బిపర్‌జాయ్‌ తీరం దాటనున్న నేపథ్యంలో పాక్‌ సర్కార్‌ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. థాటా జిల్లాలోని కేతి బండార్‌ నుంచి గుజరాత్‌ తీరం మధ్య తుఫాన్‌ తీరం దాటే ఛాన్సు ఉంది. థాటా, బదిన్‌, సజావల్‌, తార్‌పార్కర్‌, కరాచీ, మిర్పుర్కాస్‌, ఉమర్కోట్‌, హైదరాబాద్‌, ఒర్మారా, తాంటో అల్లయార్‌, తాండో ఖాన్‌ ప్రాంతాలపై తుఫాన్‌ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 60 వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సింద్‌ ప్రావిన్సు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలతో పాటు వేర్వేరు ప్రాంతాల్లో 37 రిలీఫ్‌ క్యాంపులను ఏర్పాటు చేశారు. డిజాస్టర్‌, మెడికల్‌ బందాలు రెఢీగా ఉన్నట్లు పాక్‌ నేవీ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement