Friday, May 24, 2024

జిల్లాల్లోనూ బస్తీ దవాఖానాలు.. జిల్లా కేంద్రాల‌కు తొలి ప్రాధాన్యం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : గ్రామీణులకు మెరుగైన వైద్యం కోసం పల్లె త్వరలో 2వేల దవాఖానాలను ప్రారంభించనున్న రాష్ట్ర ప్రభుత్వం.. తెలంగాణలోని పలు పట్టణాల పేదలకూ ఇంటి చెంతనే ఉచిత వైద్యం అందేలా బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయనుంది. హైదరాబాద్‌ మహానగర పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా 352 బస్తీ దవాఖానాలకు పైగా ఏర్పాటు చేసింది. ఇక్కడ బస్తీ దవాఖానాలకు పేదల నుంచి అద్భుత స్పందన రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు నిర్ణయించారు. రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాలతోపాటు ఆయా జిల్లాల్లో ఉన్న మున్సిపాలిటీలు, పట్టణ స్థాయి ఉన్న మేజర్‌ గ్రామ పంచాయతీల్లోనూ బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే ప్రాథమికంగా ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో 500 బబస్తీ దవాఖానాలను జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు.

మొదటి ప్రాధాన్యతగా జిల్లా కేంద్రాల్లోని బస్తీల్లో అందుబాటులోకి తేనున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌తోపాటు పరిసర పట్టణ జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోనూ బస్తీ దవాఖానాలు ఏర్పాటయ్యాయి. తదుపరి దశలో సంగారెడ్డి, వరంగల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ తదితర జిల్లా కేంద్రాల్లో బస్తీ దవాఖాణాలు ఏర్పాటు కానున్నాయని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాల్లో పేదలకు వైద్య చికిత్సలతోపాటు అవసరమైన వ్యాధి నిర్దారణా పరీక్షలు కూడా జరుగుతున్నాయి. వైద్య చికిత్స చేయడంతోపాటు ఉచితంగా మందులను అందించడం, పలు రకాల వైద్య పరీక్షలు.. రక్త, మూత్ర, బీపీ, షుగర్‌ తదితర వైద్య పరీక్షలను కూడా అందిస్తున్నాయి.

దీంతో పట్టణ పేద ప్రజలుత మ బస్తీల్లోనే మెరుగైన వైద్యం పొందుతున్నారు. అంతకు ముందు పేదలు ప్రతి చిన్న అనారోగ్యానికి గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌ ఆసుత్రులకు పరుగెడుతుండేవారు. అయితే బస్తీ దవాఖానాలు వచ్చాక ప్రధాన ఆసుపత్రులపై ఓపీ రోగుల తాకిడి తగ్గిందని వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. బస్తీ దవాఖానాలకు వచ్చే రోగులకు వైద్య పరీక్షలను తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్ల సహకారంతో నిర్వహిస్తున్నారు. దీంతో ఖరీదైన వైద్య పరీక్షలు కూడా సకాలంలో, ఇంటి చెంతనే పేదలకు ఉచితంగా అందుబాటులోకి వస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ జిల్లాల్లో తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్లు ఉన్నందున అక్కడ కూడా బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసి పేదలకు ఖరీదైన వైద్య పరీక్షల ను కూడా ఉచితంగానే అందించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement