Friday, May 17, 2024

ఆయిల్‌ పామ్‌లో అగ్రగామి ఏపీ.. 80 కోట్లతో సాగుదారులకు ప్రోత్సాహకాలు

అమరావతి, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌ – ఆయిల్‌ పామ్‌ (ఎన్‌.ఐ.ఎం.ఈ.వోఓపీ) విధానం అమలులో ఏపీ దేశంలోని అన్ని ప్రాంతాల కన్నా ముందుంది. ఆయిల్‌ పామ్‌ సాగు విస్తీర్ణం పెంపుదలతో పాటు దానికి అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న స్టాక్‌ పాయింట్లు, గోదాములు, ప్రాసెసింగ్‌ అండ్‌ రిఫైనరీ ప్లాంట్ల ఏర్పాటు-పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఉమ్మడి గోదావరి జిల్లాలో శరవేగంగా విస్తరిస్తున్న సాగు విస్తీర్ణాన్ని దృష్టిలో ఉంచుకుని ఏలూరులో రూ.230 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక ఆయిల్‌ పామ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ రిఫైనరీ ప్లాంట్‌ ను నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు భూసేకరణ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏలూరు జిల్లా పెదవేగిలో ఇప్పటికే ఉన్న ఆయిల్‌ పామ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఆధునీకరణ పనులను కూడా సత్వరం పూర్తి చేయాలని ఆయిల్‌ ఫెడ్‌ సంస్థకు మార్గనిర్దేశాలు అందాయి.

పెదవేగి ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ పరిధిలో ఉమ్మడి గోదావరి జిల్లాలో 23,150 ఎ కరాల ఆయిల్‌ పామ్‌ తోటలు ఉండగా, రూ.230 కోట్లతో ఇదే ఏలూరు జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆయిల్‌ పామ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ రిఫైనరీ ప్లాంట్‌ పూర్తయితే ఆయిల్‌ పామ్‌ సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతుందని అంచనా. ఇది కాకుండా ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహించేందుకు వీలుగా విశాఖపట్నంలో ఆయిల్‌ ఫెడ్‌ కార్పొరేట్‌ కార్యాలయాన్ని ఏర్పాటు చేయటంతో పాటు భారీ గోదాములు, స్టాక్‌ పాయింట్‌ కు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు త్వరలోనే టెండర్లు పిలిచేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. విదేశీ దిగుమతులను కనిష్ట స్థాయికి తగ్గించేందుకు వీలుగా దేశీయంగా ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మిషన్‌ ప్రకటించింది.

ఈ నేపథ్యంలో నేషనల్‌ మిషన్‌ అమలులో ఏపీ నుంచి సత్ఫలితాలు అందుతున్నట్టు కేంద్ర బృందం భావిస్తోంది. విస్తీర్ణం, దిగుబడిపై 2021-22 ఆర్ధిక సంవత్సరంలో మదింపు చేసిన గణాంకాల ప్రకారం దేశవ్యాపిత ఆయిల్‌ పామ్‌ విస్తీర్ణంలో 48.51 శాతం, ఉత్పత్తిలో 88.24 శాతం వాటాను ఏపీ సొంతం చేసుకోగా ఈ ఏడాది అంతకుమించి అదనంగా మరో 4 శాతం పురోగతి కనిపించినట్టు ఎన్‌.ఐ.ఎం.ఈ.వో అంచలనా. రైతులు కూడా సంప్రదాయ వ్యవసాయం నుంచి మార్కెట్‌ ఆధారిత ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మొగ్గు చూపటం ఆయిల్‌ పామ్‌ లో ఏపీ అగ్రస్థానంలో నిలబడటానికి ప్రధాన కారణమని వ్యవసాయ శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో డిమాండ్‌ కు మించి పండుతున్న వరికి బదులు ఇతర పంటలు పండిస్తే అధిక లాభాలతో పాటు- కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రాయితీలు, సబ్సిడీలు, రుణాల రూపంలో ప్రోత్సాహకాలు అధికంగా ఉండటంతో రైతులు కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి పెడుతున్నారు..1991-92లో కేవలం 8585 హెక్టార్లుగా ఉన్న సాగు విస్తీర్ణం ఇపుడు 4.2 లక్షల హెక్టార్లకు విస్తరించటమే రైతుల ఆలోచనా విధానంలో మార్పుకు సాక్ష్యమని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.

- Advertisement -

పామాయిల్‌ వినియోగం 42 శాతం

దేశవ్యాప్తంగా వంట నూనెల వినియోగంలో పామాయిల్‌ వాడకం 42 శాతంగా ఉన్నట్టు- కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో దేశంలో పామాయిల్‌ సాగు విస్తీర్ణాన్ని భారీగా పెంపుదల చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. విస్తీర్ణం, దిగుబడిని పెంచటం ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసే పరిమాణాన్ని తగ్గించుకోవచ్చని కేంద్రం భావిస్తోంది. 2020-21లో 13.13 మిలియన్‌ టన్నుల వంటనూనెను దిగుమతి చేసుకుంటే అందులో పామాయిల్‌ దిగుమతి శాతం 63.36 శాతంగా ఉంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మిషన్‌ ఆన్‌ ఎడిబుల్‌ ఆయిల్స్‌ – ఆయిల్‌ పామ్‌ (ఎన్‌.ఐ.ఎం.ఈ.వో-ఓపీ) విధానాన్ని ప్రకటించి ఈ మేరకు అన్ని రాష్ట్రాల్రకు సమాచారం పంపించింది. 2025-26 నాటికి దేశవ్యాప్తంగా 10 లక్షల హెక్టార్ల విస్తీర్ణం, 11.2 లక్షల టన్నుల దిగుబడి, 2029-30 నాటికి 28 ల లక్షల టన్నుల దిగుబడిని కేంద్రం లక్ష్యంగా ప్రకటించింది.

ఏపీలో రూ 80 కోట్లతో ప్రణాళిక

రాష్ట్రంలో ఆయిల్‌ పామ్‌ విస్తరణ, దిగుబడి పెరుగుదలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం రైతులకు టన్ను ధరను రూ 16,400కు తక్కువ కాకుండా అందించేందుకు రూ 80 కోట్లతో ప్రణాళికా వ్యయాన్ని ప్రకటించింది. ఏపీ ఆయిల్‌ ఫెడరేషన్‌ ను రంగంలోకి దింపి మద్దతు ధరలతో ఆయిల్‌ పామ్‌ ను కొనుగోలు చేస్తోంది. 15 ఏళ్ల పాటు- పెరిగిన ఆయిల్‌ పామ్‌ తోటల సాగు వ్యయాన్ని, విస్తీర్ణాన్ని, దిగుబడినీ, మార్కెట్‌ ధరలను అనుసరించి ఒక హెక్టారు స్థూల వ్యయాన్ని రూ 16,66,053 గా, రాబడిని రూ 26,08,145గా, నికర రాబడిని రూ 9,42,092 గా వ్యవసాయ శాస్త్రవేత్తలు తాజాగా గణాంకాలు రూపొందించారు. ఆయిల్‌ పామ్‌ సాగుకు అవసరమైన వేప చెక్క, ఇతర సేంద్రీయ ఎరువులను రైతు భరోసా కేంద్రాల కియోస్క్‌ బుకింగ్‌ ల ద్వారా సరఫరా చేయటం, ఆయిల్‌ ఫామ్‌ ఫార్మ్‌ గేటు-కు సమీపంలో ప్రాసెసింగ్‌ యూనిట్లు- నెలకొల్పటం, రైతులకు అవసరమైన మొక్కలను సరఫరా చేయటం..సన్న, చిన్న కారు రైతులను ఆయిల్‌ పామ్‌ సాగు వైపు దృష్టి మరల్చేలా ప్రోత్సాహకాలు పెంపొందించటం తదితర ప్రతిపాదనల అమలుకు ప్రభుత్వం కార్యాచరణ చేపడుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement