Thursday, May 9, 2024

మనకూ ఓ ఐరన్‌ డోమ్‌..! 2029 నాటికి సరిహద్దుల్లో మోహరించేందుకు ప్రణాళికలు

పాకిస్తాన్‌, చైనా నుండి ఎదురవుతున్న సవాళ్ల మధ్య భారతదేశం వైమానిక వ్యవస్థను శత్రుదుర్బేధ్యం చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలో, డిఫెన్స్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డిఆర్‌డిఒ) ఆధునిక రక్షణ వ్యవస్థను అభివృద్ది చేస్తోంది. దీర్ఘశ్రేణి లక్ష్యాలను విధ్వంసం చేయగల అధునాతన వైమానిక రక్షణ వ్యవస్థను భారతదేశం సిద్ధం చేస్తోంది. 2028-29 నాటికి దేశ సరిహద్దులను మరింత పటిష్టం చేయాలని ప్రణాళికలు రూపొందించింది.

350 కిలోమీటర్ల దూరంలోనే ఇన్‌కమింగ్‌ స్టెల్త్‌ ఫైటర్స్‌, ఎయిర్‌క్రాఫ్ట్‌లు, డ్రోన్‌లు, క్రూయిజ్‌ క్షిపణులు, ప్రెసిషన్‌ గైడెడ్‌ మందుగుండు సామగ్రిని గుర్తించి నాశనం చేయగల శక్తివంతమైన వ్యవస్థను సరిహద్దులకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. డిఆర్‌డివో వర్గాల ప్రకారం, ఇజ్రాయెల్‌లోని ఇనుప గోపురం (ఐరన్‌ డోమ్‌) తరహాలో అంతకంటే శక్తివంతమైన లాంగ్‌రేంజ్‌ వ్యవస్థను నిర్మిస్తోంది.

ఇజ్రాయెల్‌ ఐరన్‌డోమ్‌ పరిధి దాదాపు 70 కి.మీ అయితే, భారత వాయు రక్షణ వ్యవస్థ పరిధి 350 కి.మీ.గా ఉండబోతోంది. సుదూర బెదిరింపులను నిర్వీర్యం చేయడానికి ప్రస్తుతం రష్యన్‌ ఎస్‌-400 వ్యవస్థపై ఆధారపడే రక్షణ దళాలకు ఇది పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఎస్‌-400 380 కిమీల కార్యాచరణ పరిధిని కలిగి ఉంది. భూతలం నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించగల లాంగ్‌రేంజ్‌ మిస్సైల్‌ సిస్టమ్‌ను (ఎల్‌ఆర్‌-ఎస్‌ఎఎం) డిఫెన్స్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డిఆర్‌డిఒ) సిద్ధం చేస్తోంది.

- Advertisement -

ప్రాజెక్ట్‌ కుషా అని పిలువబడే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌, డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డిఆర్‌డిఒ)చే నిర్వహించబడుతుంది. శత్రు విమానాలు, క్షిపణులను సుదూర ప్రాంతాల్లో ఎదుర్కొనగల శక్తిమంతమైన మూడంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం దీని లక్ష్యం.

2.5 బిలియన్‌ డాలర్లకు పైగా విలువైన ఈ ప్రాజెక్ట్‌ వైమానిక ముప్పులను ఎదుర్కొనేందుకు స్వదేశీ సామర్థ్యాలతో సిద్ధమవుతోంది. భారతదేశం తన స్వంత దీర్ఘ-శ్రేణి వైమానిక రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేయడం వల్ల జాతీయ భద్రతను మెరుగుపరచడమే కాకుండా, విస్తరించిన దూరాలలో వైమానిక బెదిరింపులను ఎదుర్కోగల సామర్థ్యం గల లీగ్‌ ఆఫ్‌ నేషన్స్‌ సరసన చేరినట్లవుతుంది.

ఎల్‌ఆర్‌-ఎస్‌ఎఎం.. సామర్థ్యం?

లాంగ్‌రేంజ్‌ సర్వైలెన్స్‌, ఫైర్‌ కంట్రోల్‌ రాడార్స్‌, విభిన్న రకాల ఇంటర్సెప్టర్‌ మిస్సైల్స్‌తో కూడిన మొబైల్‌ ఎల్‌ఆర్‌-ఎస్‌ఎఎం వ్యవస్థ 150 కిమీ, 250 కిమీ, 350 కిమీ దూరంలోని లక్ష్యాలను సమర్థవంతంగా నిర్వీర్యం చేయగలదు. ఇది సింగిల్‌ మిస్సైల్‌ షాట్‌ను 80శాతం కచ్చితత్వంతో నిర్వహించగలదు. అలాగే వ్యూహాత్మక, క్రియాత్మక దుర్బల ప్రాంతాల్లో వైమానిక రక్షణ కవచాన్ని అందిస్తుంది.

తక్కువస్థాయి రాడార్‌ సెక్షన్‌, హైస్పీడ్‌ టార్గెట్స్‌కు వ్యతిరేకంగా ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది. అలాగే 250 కి.మీ దూరంలోని ఫైటర్‌ టార్గెట్లను సీజ్‌ చేయగలదు. ఇటీవల వైమానికదళంలో చేరిన రష్యన్‌ ఎస్‌-400 ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌కు సమానమైన సామర్థ్యాలను ఎల్‌ఆర్‌-ఎస్‌ఎఎం కలిగి ఉంటుంది. ఉపరితలం నుండి గగనతలానికి ప్రయోగించే క్షిపణులతో ఎల్‌ఆర్‌-ఎస్‌ఎఎం వ్యవస్థ మూడు పొరలతో రూపొందించబడింది. ప్రతి ఒక్కటి వివిధ శ్రేణులలో లక్ష్యాలను ఛేదించేలా రూపొందించబడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement